పాలకుర్తి టౌన్: తెలంగాణ పోలీస్ నియామక మండలి(టీజీపీఆర్‌బీ) ఆధ్వర్యంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి జరుగుతున్న దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అభ్యర్థులకు సమస్యగా మారింది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేయడంతో పలుమార్లు ప్రయత్నించినా స్కాన్ కావడం లేదు. మొబైల్‌లో ఫేస్ స్కాన్ చేస్తున్న సమయంలో ఎర్రర్ రావడంతో తదుపరి దశకు వెళ్లలేకపోతున్నారు. ఇంటర్నెట్ సరిగా ఉన్నప్పటికీ సమస్య కొనసాగుతోంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఫేస్ అథెంటికేషన్ సమస్యలను వెంటనే పరిష్కరించి, దరఖాస్తు పూర్తి చేసుకునేలా ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని అధికారులను కోరుతున్నారు. దరఖాస్తు గడువు ఈనెల 16 వరకే ఉండడంతో అప్పటిలోగా సమస్య పరిష్కరించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్కాన్ కావడం లేదు
కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్నా. ఫేస్‌అథెంటికేషన్ కోసం పలుమార్లు ప్రయత్నించినా స్కాన్ కావడం లేదు. మరో మొబైల్‌లోనూ ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. దరఖాస్తు గడువు ముగిసేలోగా అథెంటికేషన్ పూర్తి కాకపోతే ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని భయంగా ఉంది. అభ్యర్థులు సాంకేతిక సమస్యలతో నష్టపోకుండా అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలి.
–గోనె రశ్మిత, రాఘవపురం, పాలకుర్తి
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల అవస్థలు
ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని వేడుకోలు


