రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండలోని పలు సర్వే నంబర్ల భూ రికార్డుల్లో చోటు చేసుకున్న మార్పులపై కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా సుమోటో రివిజన్ చేపట్టి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిడిగొండ గ్రామానికి చెందిన మాసంపల్లి శాంతోజి సమర్పించిన పిటిషన్, రఘునాథపల్లి తహసీల్దార్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. 1981 నాటి సప్లిమెంటరీ సేత్వార్ ప్రకారం సర్వే నంబర్లు 191, 192,193,194లలోని కొన్ని భూభాగాలు పట్టాగా, మరికొన్ని రోడ్డుగా నమోదయ్యాయి. అయితే 1991–92 నుంచి పహణీల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నట్లు తేలింది. రోడ్డు కోసం సేకరించిన స్థలం పట్టా భూమిలో కలవడం, పట్టా భూములు సర్కారీగా మారడం వంటి వ్యత్యాసాలు గుర్తించారు. జాతీయ రహదారి నిర్మాణంలో స్వాధీనం చేసుకున్న కొన్ని భూములను ఆర్‌అండ్‌బీగా పేర్కొన్న అంశంపైనా పూర్తిస్థాయి విచారణ జరపనున్నారు. ఈ సర్వే నంబర్లలో హక్కులు, సాగు, పట్టా ఉన్న వారు తమ వద్ద ఉన్న ఆధారాలతో ఈ నెల 21న అభ్యంతరాలు, 24న కలెక్టరేట్ కోర్టు హాల్‌లో విచారణ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమయపాలన పాటించాలి
రఘునాథపల్లి: వైద్యారోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ అన్నారు. గురువారం ఉదయం ఆమె రఘునాథపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు రిజిస్టర్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వ్యాధుల నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్రవంతి, సీహెచ్‌ఓలు రామ్‌కిషన్, జయపాల్‌రెడ్డి, సూపర్‌వైజర్ సులోచన, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు నిట్ డైరెక్టర్ ఎంపిక
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని ఇండియా స్పార్క్ సంస్థ ఇండియా స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు ఎంపిక చేసి గురువారం సత్కరించింది. 2023వ సంవత్సరం నుంచి నిట్ వరంగల్ డైరెక్టర్‌గా, 30 ఏళ్ల నుంచి విద్యా పరిశోధన రంగాల్లో వివిష్ట ప్రతిభ కనబరుస్తున్న నిట్ డైరెక్టర్‌ను ఇండియా స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు ఎంపిక చేసినట్లు ఇండియా స్పార్క్ సంస్థ సీఈఓ రూపా తంతి తెలిపారు.
హన్మకొండ కల్చరల్: గణపతి నవరాత్రి ఉత్సవాలను మత సామరస్యంతో, కులాలకు అతీతంగా ధార్మిక నిష్టతో జరుపుకోవాలని హంపీ విద్యారణ్య పీఠాధిపతి గోవిందానంద సరస్వతీస్వామి అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని స్వామీజీ సందర్శించి రుద్రేశ్వరస్వామికి మహాస్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం ఆలయ మహామండపంలో స్వామీజీకి పండ్లు తాంబూలం అందజేశారు. భక్తులను ఉద్దేశించి స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. స్వామీజీ మాట్లాడుతూ.. వరంగల్‌లోనే చాతుర్మాస దీక్ష నిర్వహిస్తున్నానని, జిల్లాలోని దేవాలయాలను సందర్శించి శిథిలమైన దేవాలయాలను పునర్జీవింపజేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని పేర్కొన్నారు.


