జనగామ: తెలంగాణ సాయుధ రైతాంగ పోరులో చాకలి అయిలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు, చాకలి ఐలమ్మ మనుమరాలు చిట్యాల శ్వేత హాజరయ్యారు. ఈసందర్భంగా అయిలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మట్లాడుతూ.. సామాజిక అన్యాయం, జమీందారీ వ్యవస్థ, దోపిడీకి వ్యతిరేకంగా అయిలమ్మ పోరాటం ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. విస్నూర్ దేశ్‌ముఖ్ దోపిడీకి వ్యతిరేకంగా అయిలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు, చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేత మాట్లాడుతూ.. ఐలమ్మ ఆత్మగౌరవానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష గుర్తింపు ఇవ్వడం సంతోషకరమన్నారు. చాకలి ఐలమ్మ పోరాట చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె పేరు భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ గౌరవంగా నిలిచిందని, రష్యా, జపాన్, చైనా, సోవియట్ దేశాల్లో కూడా అయిలమ్మ పేరిట గ్రంథాలయాలు ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, ఆర్టీఏ సభ్యుడు చిలువేరు అభిగౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మైలారం వెంకటేశ్వర్లు, కొలిపాక నరసింహులు, ఎదునూరి మదార్, శివరాజ్ యాదవ్, పరశురాములు, బక్క శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


