జిల్లాకు మంజూరైన ల్యాబ్‌లు
జనగామ: పాఠశాల విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని, పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ బడుల్లో శాస్త్ర విజ్ఞానంపై ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు సైన్స్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయనుంది. సమగ్ర శిక్ష తెలంగాణ 2026–27 వార్షిక కార్యాచరణ, బడ్జెట్‌లో భాగంగా జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ల్యాబొరేటరీలను మంజూరు చేసింది. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు పరి పాలనా అనుమతులు ఇవ్వగా, ఒక్కో ల్యాబ్‌కు రూ.26 లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.1.04 కోట్ల నిధులు కేటాయించారు. మంజూరు చేసిన నిధులతో కేవలం ల్యాబ్ గదుల నిర్మాణమే కాకుండా వర్క్‌స్టేషన్లు, ఫర్నిచర్, సైన్స్ ల్యాబ్ పరికరాల కొనుగోలు, సరఫరా, ఏర్పాటు, పరీక్షలు, వినియోగానికి సిద్ధం చేయడం, అంతర్గత విద్యుదీకరణ, అనుబంధ పనులు చేపట్టనున్నారు. పనులను టర్న్‌కీ విధానంలో తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించి చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
టెండర్లు ఖరారైన 15 రోజుల్లో
పనుల కోసం 2025–26 షెడ్యూల్ ఆఫ్ రేట్స్‌ను, సివిల్ పనులకు 5 శాతం కాంట్రాక్టర్ లాభా న్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. టెండర్లు ఖరారైన 15 రోజుల్లో సంబంధిత సంస్థతో ఒప్పందాలు పూర్తి చేసి, అనంతరం పనులను వెంటనే ప్రారంభించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల వినియోగానికి అవసరమైన ప్రదర్శన, శిక్షణ, నిర్వహణ పుస్తకాలు, వారంటీ, నిర్వహణ సదుపాయాలను కూడా కల్పించాలి. పనులు పూర్తయిన అనంతరం తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ ఇంజినీర్, జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా పరిశీలించి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ల్యాబ్‌లను అప్పగించనున్నారు.
బాలికల విద్యకు పెద్దపీట
జిల్లాలో ఎంపికై న 4 పాఠశాలల్లో 3 పాఠశాలలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ, రఘునాథపల్లి, నర్మెట, కొడకండ్ల) కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, వెనకబడిన వర్గాల బాలికలకు సైన్స్ పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. జిల్లాలోని రఘునాథపల్లి, పాలకుర్తి, నర్మెట, కొడకండ్ల మండలాల్లో రూ.1.04 కోట్ల వ్యయంతో సిద్ధం కానున్న ఈ ప్రయోగశాలలు విద్యార్థులలో సైన్స్‌పై ఆసక్తిని పెంచి, భవిష్యత్తులో వారు పోటీ పరీక్షల్లో రాణించడానికి, ఉన్నత విద్యా అవకాశాలను అందుకోవడానికి ఎంతగానో దోహదపడనున్నాయి. సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణం–వర్క్ స్టేషన్ ఫర్నిచర్ రూ.25 లక్షలు కేటాయించగా, ఇందులో ప్రయోగశాల పరికరాల కొనుగోలు, తదితర వాటి కోసం రూ. లక్ష ఖర్చు చేయనున్నారు.
జిల్లాలోని నాలుగు పాఠశాలలకు సైన్స్ ల్యాబ్‌లు
రూ.1.04 కోట్లతో నిర్మాణం
ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షలు
ప్రయోగాత్మక విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహం
మండలం పాఠశాల యూనిట్లు వ్యయం
రఘునాథపల్లి కేజీబీవీ 01 రూ.26 లక్షలు
పాలకుర్తి చెన్నూరు 01 రూ.26 లక్షలు
హైస్కూల్
నర్మెట కేజీబీవీ 01 రూ.26 లక్షలు
కొడకండ్ల కేజీబీవీ 01 రూ.26 లక్షలు
మొత్తం పాఠశాలలు 04 రూ.1.04 కోట్లు


