జనగామ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్‌జోన్ (జనగామ) డీసీపీ బి.రాజామహేంద్ర నాయక్‌కు ఐపీఎస్ హోదా లభించింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు 24న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ క్యాడర్‌లో ఖాళీగా ఉన్న తొమ్మిది ఐపీఎస్ పోస్టుల భర్తీకి 2025 సెలెక్ట్ లిస్ట్‌ను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక కమిటీ ఆమోదించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ఐపీఎస్‌కు పదోన్నతి పొందిన అధికారుల్లో బి.రాజామహేంద్ర నాయక్ ఒకరు. రాజామహేంద్ర నాయక్ ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్‌జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పని చేసిన ఆయన్ను 2024లో జనగామ డీసీపీగా నియమించారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ప్రకారం ఐపీఎస్ హోదా పొందిన అధికారులపై నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగనుంది.
2010 బ్యాచ్ డీఎస్పీగా..
పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన బి. రాజామహేంద్ర నాయక్ 2010 బ్యాచ్ డీఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. కరీంనగర్‌లో రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీ సర్‌గా ఎస్పీ హోదాలో పని చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అదనపు ఎస్పీగా, మహబూ బాబాద్, ములుగు ప్రాంతాల్లో ఎస్‌డీపీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్‌లో డీఎస్పీ (క్రైమ్స్)గా కూడా సేవలందించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్‌డీపీఓగా బాధ్యతలు నిర్వహించారు. వివిధ జిల్లాలు, విభాగాల్లో పనిచేస్తూ పోలీసింగ్‌లో అనుభవాన్ని సంపాదించిన ఆయనకు తాజాగా ఐపీఎస్ హోదా లభించడంతో సహచరులు, పోలీస్ శాఖ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
డీసీపీకి సీపీ అభినందనలు
ఐపీఎస్ హోదా పొందిన డీసీపీ రాజామహేంద్ర నాయక్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత(ఐపీఎస్)ను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్క అందజేశారు. ఈ సందర్భంగా రాజామహేంద్రనాయక్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.
పోలీస్ శాఖ వర్గాల్లో హర్షం


