జనగామ: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత యూనిఫామ్‌లు ఇబ్బందులకు కారణమవుతున్నాయి. జిల్లాలో సుమారు 500 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30వేల మందికి పైగా విద్యార్థులు చదువుతుండగా, ఇప్పటి వరకు ఒక్కో జత యూనిఫాం మాత్రమే అందింది. రెండో జత యూనిఫాంలను సిద్ధం చేస్తున్నారు. అయితే మొద టి జత దుస్తుల్లో విద్యార్థుల కొలతలకు సరిపోని షర్ట్, నిక్కర్లు, పొడవు, పొట్టి, లూజు, టైట్ సమస్యలు తలెత్తడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి.
కొలతలు తీసుకోకుండానే కుట్టించారా..?
కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల కొలతలు అరకొరగా తీసుకుని యూనిఫాంలు కుట్టించినట్లు తెలుస్తోంది. దీంతో ఒకరికి షర్టు పెద్దగా, మరొకరికి చిన్నగా, కొందరికి నిక్కర్లు పొట్టిగా, మరికొందరికి పొడవుగా వచ్చాయి. గుండీలు, భుజాల వద్ద కొలతలు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన అధికారులు ఇద్దరు మాస్టర్లను ఏర్పాటు చేసి, పాఠశాలల నుంచి వచ్చిన సమాచారంతో దుస్తుల కొలతలను సరిచేసి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
సైజు తేడాతో..
బచ్చన్నపేట మండలంలో 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఐదు ప్రాథమికోన్నత, 27 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూల్‌ను కలుపుకొని 3,045 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్నిచోట్ల యూనిఫాంలు తక్కువగా రావడంతో అదనంగా వచ్చిన పాఠశాలల నుంచి తెప్పించి పంపిణీ చేశారు. అయితే సైజులు సరిపోక కొందరు విద్యార్థులు పిన్నీసులు, టక్కులు వేసుకొని షర్ట్‌ను సర్దుకుంటున్నారు. జఫర్‌గఢ్ మండలంలో 30 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,542 మంది విద్యార్థులకు గాను ఇప్పటి వరకు 1,900 మందికి మాత్రమే ఒక్క జత యూనిఫాం అందించారు. ముందుగా కొలతలు తీసుకోకపోవడంతో షర్ట్, నిక్కర్లు లూజుగా ఉండటంతో పాటు సైజులు తేడాగా వచ్చాయి. నిక్కర్లు బెల్టు, మొల్దారాలు పెట్టినా జారిపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
పంపిణీలోనూ జాప్యం
స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 861 మందికే అందాయి. అవి కూడా ఒక్కొక్క జత మాత్రమే. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో యూనిఫాంలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోనూ ఒక్క జత యూనిఫాం మాత్రమే అందిన పాఠశాలలు ఉన్నాయి. కొడకండ్లలో 2,853 మంది విద్యార్థులకు మొదటి జత అందగా, కొలతలు సరిపోక పలువురు సొంతంగా సరిచేయించుకున్నారు.
లింగాలఘణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 95 మంది విద్యార్థులు ఉన్నారు. కొందరికి పొట్టి షర్ట్‌లు, నిక్కర్లు, మరికొందరికి పొడవైన దుస్తులు అందాయి. చిన్నవిగా వచ్చిన దుస్తులను ఎలా పెద్దగా చేస్తారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నర్మెట మండలంలోని పాఠశాలల్లో మొదటి జత పంపిణీ పూర్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో నాణ్యత లేని వస్త్రం, అనుభవం లేని దర్జీలతో కుట్టించడం వల్ల కుట్లు సరిగా లేకపోవడం, జేబులు అస్తవ్యస్తంగా ఉండటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. జనగామ మండలం, అర్బనన్‌్ పరిధిలోని 55 పాఠశాలల్లో 4,140 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందించారు. అయితే కొలతలు సరిపోకపోవడంతో పలువురు తల్లిదండ్రులు సొంత ఖర్చుతో దుస్తులను సరిచేయించారు.
పొడుగు అంగీ..పొట్టి నిక్కర్లతో విద్యార్థుల ఇబ్బందులు
పిన్నీసులు, బెల్ట్‌లతో సర్దుబాటు
ఒక్కో విద్యార్థికి ఒక్కో సైజు
బట్ట ఇచ్చారు..సైజులో నిర్లక్ష్యం ప్రదర్శించారు
ఇంకా పలుచోట్ల కానరాని దుస్తుల పంపిణీ


