● ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
● 186 దరఖాస్తుల స్వీకరణ
జనగామ రూరల్: తమ సమస్యల పరిష్కారానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల సమస్యలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆలకించి పరిస్కారానికి మార్గం చూపుతున్నారు. ప్రతీ వినతిపై అధికారులు నిర్లక్ష్యం లేకుండా స్పందించి, నిర్ణీత గడువులో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 189 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ వచ్చిన అర్జీలను పరిశీలిస్తూ ఆర్జీదారుల సమస్యలను పూర్తిగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, డీపీఓ వెంకట్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు ఇలా ఉన్నాయి..
జఫర్‌గఢ్ మండలం తీగవరం గ్రామానికి చెందిన వై.రాజు, తాను 6 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగా, ఆ భూమి రిజిస్ట్రేషన్ జరగకుండా సంఘం సభ్యులు ఆపారని, ఆ భూమి రిజిస్ట్రేషన్ తన పేరు మీదకు చేసేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు.
చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన ఇమ్మడి నర్తకి, తన 2.27 గుంటల భూమిని అమ్ముకునేందుకు అడ్డుపడుతున్నారని, ఆ భూమిని అమ్ముకునేందుకు తన బావ నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని వినతి అందజేశారు.
పాలకుర్తి మండలం మేకలతండా గ్రామానికి చెందిన ఎల్.స్వర్ణ, తమ గ్రామానికి సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, కానీ స్థలం లేదని స్థలం కేటాయించాలని మనవి చేస్తూ వినతిపత్రం సమర్పించారు.
జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్‌కు చెందిన ఎం.సరిత, తన కుమారుడు ఎం.మణిదీప్‌కు దివ్యాంగుల పింఛన్ రెండు నెలలుగా నిలిపివేయడం జరిగిందని, ఆధార్ కార్డులో వివరాల సవరణ చేయాలని, ఈ మేరకు నిలిచిన పింఛన్ వెంటనే పునరుద్ధరించాలన్నారు.
మండల కేంద్రంలోని బొడ్రాయి సమీపంలో ఇంటి యజమానుల నుంచి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న ఇండస్ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసు కోవాలని పాలకుర్తి మండల కేంద్రంలోని మహిళలు వినతి పత్రం అందించారు. పక్కనే మహిళా సంఘం కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, పిల్లలకు వైద్యసేవలు అందించే హెల్త్ సెంటర్ ఉన్నాయని, భద్రత, ఆరోగ్య కారణాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
అరగంటలోనే పరిష్కారం
జిల్లా కేంద్రంలోని బాణాపురం కాలనీకి చెందిన మహమ్మద్ రఫత్ తన ఒక సంవత్సరం వయసు గల కుమార్తె మహమ్మద్ అల్ఫియనూర్ ఆరోగ్యశ్రీ కార్డులో పేరు నమోదు కాకపోవడంతో చికిత్సకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రఫత్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. చిన్నారి అల్ఫియనూర్ కంటి సమస్యతో బాధపడుతుండగా, హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించాల్సి ఉందని వైద్యులు తెలిపారని, ఆపరేషన్‌కు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ కార్డులో చిన్నారి పేరు నమోదు లేకపోవడంతో చేర్చాలని కలెక్టర్‌కు విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించి, అరగంట వ్యవధిలోనే చిన్నారి పేరు ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.


