జనగామ రూరల్: దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని, రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు విమర్శించారు. ఆదివారం జిల్లాలో రాష్ట్రస్థాయి పాఠశాల విద్యార్థుల రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సింది పోయి పాఠశాలల మూసివేత, విలీనాలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తోందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణాలతో పాఠశాలలను మూసివేయడం ద్వారా గ్రామీణ, పేద, కార్మిక, దళిత, ఆదివాసీ కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరుస్తూ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్, ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, దామెర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, విఘ్నేష్, జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.


