జనగామ: బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమం జనగామ పట్టణంలో ఆదివారం భక్తి, భావోద్వేగం, ఐక్యతల నడుమ ఘనంగా ముగిసింది. సంత్ సేవాలాల్ మహారాజ్, మెరామయాడి ఆశీస్సులతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ముగింపు సందర్భంగా బతుకమ్మకుంట వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమానికి సుమారు 500 మంది బంజారా, గిరిజనులు హాజరయ్యారు. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి వాంకుడోతు అనిత ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తీజ్ పండుగ బంజారాలకు కేవలం ఆచారం, ఉత్సవం మాత్రమే కాదని, అది వారి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తొమ్మిది రోజుల పాటు బంజారా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు, ప్రత్యేక ఆభరణాలతో అలంకరించుకొని తీజ్‌ను భక్తిశ్రద్ధలతో పూజించారు. చివరి రోజు బతుకమ్మ కుంట వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలునాయక్, భిక్కునాయక్, లాల్మా నాయక్, దేవి, విజయ, మంజుల, రాధ, లలిత తదితరులు పాల్గొన్నారు.


