రౌడీషీటర్లపై నిరంతర నిఘా | - | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్లపై నిరంతర నిఘా

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

వరంగల్‌ క్రైం: పోలీస్‌ స్టేషన్‌ పరిధి రౌడీషీటర్ల వ్యవహార శైలిపై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్‌ శ్వేత మాట్లాడారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతీ పోలీస్‌ అధికారి నిరంతరం శ్రమించాల్సి ఉంటోందని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని చెప్పారు. అనంతరం పెండింగ్‌ కేసులకు సంబంధించి నిందితుల అరెస్ట్‌లు, కేసుల దర్యాప్తు, కోర్టులో ఉన్న కేసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్‌, దారా కవిత, రాజమహేంద్ర నాయక్‌, కిషన్‌సింగ్‌, అదనపు డీసీపీలు సురేశ్‌ కుమార్‌, బాలస్వామితో పాటు ఏసీపీలు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

కుసుంబాయితండాలో సంపూర్ణ మద్య నిషేధం

రఘునాథపల్లి: మండలంలోని కుసుంబాయితండాను మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. శనివారం సర్పంచ్‌ కొర్ర స్వరూపరాజేందర్‌నాయక్‌ అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామంలో గుడుంబా, మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎవరైనా గ్రామంలో గుడుంబా, మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా జేఏసీ నూతన

కార్యవర్గం ఏర్పాటు

జనగామ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు తొట్ల రాఘవేంద్ర ముదిరాజ్‌ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా బోగా రామ్‌దయాకర్‌, ఉపాధ్యక్షులుగా మచ్చ బాలనరసయ్య, కడకంచి మధుసూదన్‌, పాముకుంట్ల కృష్ణమూర్తి, తుపాకుల బాలనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పన్నీరు సత్యం, సహాయ కార్యదర్శులుగా దుర్గం సందీప్‌కుమార్‌, మిద్యపాక రాజు, కోశాధికారిగా కోలపూరి రవి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా బత్తిని నరసింహులు, గాడిపెళ్లి కిషోర్‌ కుమార్‌, చింతల చంద్రమోహన్‌ను నియమించారు.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు

జనగామ రూరల్‌: జిల్లాలో 2026 విద్యాసంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లతో ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

నాన్‌టీచింగ్‌ పోస్టులకు

దరఖాస్తు చేసుకోండి

జనగామ రూరల్‌: జిల్లాలోని ఆదర్శ పాఠశాల బాలిక వసతి గృహాల్లో రెండు నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బచ్చన్నపేట మండలంలో 1 అసిస్టెంట్‌ కుక్‌ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణ ఉండాలని, నెలకు రూ.6500 వేతనం ఉంటుందన్నారు. రఘునాథపల్లి ఆద ర్శ పాఠశాలలో ఒక వాచ్‌ఉమెన్‌ పోస్టు ఖాళీ ఉందని, టెన్త్‌ ఉత్తీర్ణత ఉండాలన్నారు. నెలకు రూ.8,710 వేతనం ఉంటుందన్నారు. దరఖాస్తులు ఈనెల 24నుంచి 27 వరకు అందించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికకు 30న కలెక్టరేట్‌లో పరీక్ష ఉంటుందన్నారు.

కేజీబీవీల్లో 9 పోస్టులు..

జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో 9 నాన్‌–టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. నెల వేతనం రూ.9,750 ఉంటుందని హెడ్‌ కుక్‌, అటెండర్‌కు 10వ తరగతి, అసిస్టెంట్‌ కుక్‌, స్వీపర్‌కు 7వ తరగతి. స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. 24నుంచి 27సాయంత్రం వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 30న ఉదయం 10.30 పరీక్ష ఉంటుదన్నారు. చిల్పూర్‌లో ఒక స్వీపర్‌ పోస్టు, నర్మెట లో రెండు స్వీపర్‌, పాలకుర్తిలో 1 హెడ్‌ కుక్‌, కొడకండ్లలో 1 అటెండర్‌, జనగామలో 1 హెడ్‌ కుక్‌, 1అసిస్టెంట్‌ కుక్‌, 1 స్వీపర్‌ పోస్టు, బచ్చన్నపేటలో అసిస్టెంట్‌ కుక్‌ ఖాళీగా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement