స్టేషన్‌ఘన్‌పూర్: పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓను 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గురువారం బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ముందుగా స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి శివునిపల్లి వివేకానంద, శివాజీ చౌక్, గాంధీ చౌక్‌ల మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి దాదాపు 20 నిమిషాలపాటు రాస్తారోకో చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థుల పోరుకు మద్దతు తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో పాటు బీఆర్‌ఎస్ మండల నాయకులు రాస్తారోకో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు మాట్లాడుతూ.. ఐదు రోజులుగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అనంతరం విద్యార్థులు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్‌ప్రకాష్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, నాయకులు చల్లా రఘురెడ్డి, శ్యామ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఐదో రోజు కొనసాగిన పాలిటెక్నిక్
విద్యార్థుల నిరసన
జాతీయ రహదారిపై రాస్తారోకో, ఆర్డీఓకు వినతి పత్రం అందజేత


