జనగామ రూరల్: బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీకి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెనకబడిన తరగతుల మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా శక్తివంతులను చేసేందుకు 100శాతం సబ్సిడీపై ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్ల పంపిణీ’ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో అర్హులైన బీసీ మహిళల ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూనిట్ వ్యయం: రూ.12,000 (100శాతం ఉచిత సబ్సిడీ) ఉంటుందని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఉండాలన్నారు. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. మేర, మేరు సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000లోపు ఉండాలని రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి ఉండాలని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని సెప్టెంబర్ 13వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నలుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నలుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.ఫణింధర్ వీఆర్ నుంచి నెక్కొండ సర్కిల్, ఎస్.శ్రీనివాస్ నెక్కొండ సర్కిల్ నుంచి వీఆర్ వరంగల్, జె.శంకర్‌రావు వీఆర్ వరంగల్ నుంచి దుగ్గొండి సర్కిల్, ఎం.సాయిరమణ దుగ్గొండి సర్కిల్ నుంచి వీఆర్ వరంగల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యం విక్రయిస్తే రూ.లక్ష జరిమానా
రఘునాథపల్లి: మండలంలోని వేపలగడ్డతండాతో పాటు శివారులోని చర్లతండా సంపూర్ణ మద్యపాన నిషేధానికి అడుగులు పడ్డాయి. బుధవారం సర్పంచ్ గుగులోతు మోతిలాల్ అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీలో గ్రామ పరిధిలో గుడుంబా, మద్యం విక్రయాలను నిషేదిస్తున్నట్లు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎవరైనా విక్రయిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు ప్రభుత్వ పథకాలు నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. గుడుంబా నిర్మూలనపై పంచాయతీ తీర్మానం చేయడంపై ఎకై ్సజ్ అధికారులు సర్పంచ్‌ను అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతి, ఉప సర్పంచ్ భూక్య భజన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి
బచ్చన్నపేట: ప్రస్తుత సమయంలో ఎల్‌నినో ప్రభావంతో నీటిమట్టం బాగా తగ్గిపోయిందని, అందరూ నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్‌కే ఎండీ సర్తజ్ బాషా అన్నారు. మండలంలో అమలవుతున్న జల్ సంచాయి జన్ బాగిదార్ (జేఎస్‌జేబీ) పథకం కింద జరుగుతున్న నీటి సంరక్షణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. మండలంలోని కట్కూర్, బచ్చన్నపేట, లింగంపల్లి, కట్కూర్, లక్ష్మాపూర్ గ్రామాలలో పర్యటించి ఫాంపాండ్స్, మ్యాజిక్ సోక్ ఫిట్స్, పెరకోలేషన్ పాండ్స్, బోర్ వెల రీఛార్జీ పిట్స్‌లను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో నేరుగా రైతులు, లబ్ధిదారులతో మాట్లాడి, వాటితో ప్రయోజనం చేకూరుతుందా అని తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లావణ్య, డీఆర్‌డీఓ నోడల్ అధికారి కొప్పురపు శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ కృష్ణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.
జఫర్‌గఢ్‌లో జాంబీ చేప
జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని ఓ కందకంలో మత్స్యకారులు వలలతో చేపలు పడుతుండగా బుధవారం వింత చేప లభ్యమైంది. ఎక్కువగా సముద్రంలో అరుదుగా ఉండే దెయ్యం (జాంబీ) చేప గోదావరి జలాల ద్వారా రిజర్వాయర్లకు వచ్చి ఉంటుందని, వీటి నుంచి వరదల్లో కలిసి కందకంలోకి వచ్చి ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.


