నిత్యావసర భారం | - | Sakshi
Sakshi News home page

నిత్యావసర భారం

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

సరుకులు పిరం.. సగటుజీవిపై పెనుభారం

నెల రోజుల్లోనే 20 నుంచి 40 శాతం వరకు పెరుగుదల

ధరాఘాతంతో పేద, మధ్యతరగతి విలవిల

రెట్టింపైన వంట, రోజువారీ ఖర్చులు

జనగామ: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారుతోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి, చిరుద్యోగులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులపై ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలోనే సరుకుల ధరలు 20 నుంచి 40 శాతం వరకు పెరగడంతో కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి.

ఉచిత బియ్యం ఉన్నా..

రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా లభిస్తున్న బియ్యం పేద కుటుంబాలకు కొంత ఊరట ఇస్తున్నా, కూరలు, పప్పులు, నూనె, మసాలాల ధరలు పెరగడంతో రోజువారీ వంట ఖర్చు తగ్గడం లేదు. తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే కూలీలు, చిరుద్యోగులు పోషకాహారాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రవాణా భారం.. ధరల పెరుగుదలకు కారణం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, రవాణా ఖర్చులు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం వంటి కారణాలతో సరుకుల ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. సరఫరా వ్యయాలు పెరిగే కొద్దీ మార్కెట్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది.

కూరగాయలు..సబ్బులు..

నిత్యావసర సరుకులతోపాటు కూరగాయలు, సబ్బుల ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. కూరగాయలు రకాన్ని బట్టి కిలో రూ.40 నుంచి రూ.60, రూ.80 వరకు విక్రయిస్తున్నారు. కొబ్బరికాయ రూ.25 నుంచి రూ.35కు, కిలో సర్ఫ్‌ రూ.65 నుంచి రూ.85కు, డిటర్జెంట్‌ సబ్బు రూ.32 నుంచి రూ.40కు పెరిగింది. దీంతో నెలవారీ ఆదాయంలో ఆహార ఖర్చుకే అధిక భాగం వెచ్చించాల్సి వస్తోంది. ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఆదాయం పెరగకుండానే ఖర్చులు పెరుగుతుండటంతో పొదుపు మాట అటుంచి, నెలా ఖరుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరుకు(కిలో/లీటర్‌) గత ప్రస్తుత పెరుగుదల

ధర ధర

చక్కెర 44 56 12

వెల్లుల్లి 180 240 60

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 140 180 40

ఉల్లిగడ్డ 25 45 20

కారంపొడి 260 350 90

పసుపు 180 240 60

చింతపండు 130 170 40

మినపపప్పు 110 130 20

పల్లీలు 120 150 30

బాదం 850 1,050 200

కూలి డబ్బులు సరుకులకే..

నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. మా కుటుంబంలో మొత్తం ఆరుగురం కుటుంబ సభ్యులు ఉంటాం. వ్యవసాయ కూలీ పని చేస్తూ జీవిస్తున్నాం. పప్పులు, నూనెలు తదితర నిత్యావసర సరుకులకు గతంలో నెలకు రూ.2,000 ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడంతో రూ.4వేలకు పెరిగింది. కూలి చేస్తే వచ్చే డబ్బులన్నీ నిత్యావసర సరుకులకే సరిపోతుంది. ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలి.

–తోట కొమురమ్మ, గృహిణి, శివునిపల్లి

నెల ఖర్చు పెరిగింది

మూడు నెలలుగా కిరాణం సామాను ఖర్చు రూ.10వేలకు పైగా పెరిగింది. మూడు నెలల క్రితం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఉన్న మాకు రూ.20 వేలకు నూనెలు, ఉప్పులు, పప్పులు, సబ్బులు వంటి కిరాణం సామాను వచ్చేది. ప్రస్తుతం రూ.30 వేల వరకు పెరిగింది. దీంతో మాలాంటి సామాన్య కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది.

–ఇటుకల సక్కుబాయి,

లింగాలఘణపురం, గృహిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement