● ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు
● తెలుగు పాఠ్యాంశాల్లో అధిక మార్పులు
జనగామ రూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడిఝెట్ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్ విద్యలో సిలబస్‌లో యూనిట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం నుంచి నూతన కరికులమ్‌తో సవరించిన పాఠ్యపుస్తకాలు యూనిట్ వారీగా డిజిటల్ బోధన పద్ధతులు అమలు చేయనుంది. ఇప్పటికే పలు సబ్జెక్ట్‌ల వారీగా సిలబస్ పై అధ్యాపకులకు రెండు రోజుల పాటు భువనగిరిలో శిక్షణ ఇచ్చారు. అలాగే ఇంటర్‌లో మారుతున్న పరిస్థితులను బట్టి ఇంటర్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యపై అధ్యాపకులకు జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
మార్పులివే..
ఇంటర్‌లో సబ్జెక్టుల వారీగా అనేక మార్పులు చేశారు. ఇంటర్మీడిఝెట్ తెలుగు పుస్తకాన్ని మార్చేశారు. జంతుశాస్త్రంలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించగా ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు కేటాయించారు. భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చేర్చడంతో పాటు ప్రాక్టికల్‌కు 15 మార్కులు, వృక్షశాస్త్రంలో ఆర్థిక వృక్షశాస్త్రం చేర్చి ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు కేటాయించారు. గణితంలో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతాలు అధ్యాయాలు చేర్చారు. రసాయనశాస్త్రంలో పదార్థాల స్థితులు, పర్యావరణ రసాయన శాస్త్రం, స్టోయికియోమెట్రీ పాఠంలో మొలారిటీ భావన తొలగించారు. మొదటి సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల కోసం క్వాలిటేటివ్ అనాలసిస్ నుంచి లవణాలు కొత్తగా చేర్చారు. హిస్టరీలో యూనిట్ –6లో దక్షిణ భారతదేశం, దక్కన్ రాజ్యాలు, యూనిట్–8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చగా మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల తొలగించారు. సుల్తానేట్ రాజవంశీయుల అంశం యూనిట్–7లో కలిపారు. యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు, జాతీయోద్యమం (తొలిదశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఎకనామిక్స్ పాజిటివ్ ఎకనామిక్స్, నార్రేటివ్, నార్మేటివ్ ఎకనామిక్స్ చేర్చారు. సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు.
పాఠ్యాంశం అర్థమయ్యేలా..
కొత్తగా చేర్చిన అంశాలను సులభంగా విద్యార్థులకు అర్థం చేయించనున్నారు. టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలు, డిజిటల్ పద్ధతులను ఉపయోగించి పాఠాలను ఆకర్షణీయంగా ఎలా చెప్పాలో శిక్షణ ఇస్తున్నారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే నూతన అసెస్‌మెంట్, పరీక్షల ప్యాట్రన్స్‌పై అవగాహన కల్పిస్తారు. కేవలం సబ్జెక్టు బోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా గైడెన్స్ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.
అధ్యాపకులకు శిక్షణ
ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు మారిన సిలబస్, అలాగే ఏఐ, డిజిటల్ బోధనపై అధ్యాపకులకు ఆయా సబ్జెక్ట్‌ల వారీగా రెండు రోజుల పాటు మాస్టర్ ట్రెనర్స్ శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు భవిష్యత్‌లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల సాథన లక్ష్యంగా విద్యా విధానం ఉంటుంది.
–జితేందర్‌రెడ్డి, డీఐఈఓ


