● ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలొచ్చి అర్జీలు సమర్పించారు. అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి 259 వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
● జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్‌కు చెందిన నల్ల సుజాత.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇబ్బందులు పడుతున్నామని, ఆర్థిక సాయం అందించాలని దరఖాస్తు చేసుకుంది.
● బచ్చన్నపేట మండలం ఇటిక్యాలపల్లి గ్రామానికి చెందిన సుంకె రాములమ్మ.. తన పది గుంటల భూమికి సర్వే నిర్ణయించి, హద్దురాళ్లు పాతించారని, కాని పక్కన ఉన్న వారు వాటిని తొలగించారని వారిపై చర్యలు తీసుకోవాలని వినతి అందించింది.
● తనది నిరుపేద కుటుంబమని, ఎలాంటి ఆధారం లేదని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని దేవరుప్పుల మండలం పెద్దమడ్డూర్ గ్రామానికి చెందిన గనుపాక సునీత దరఖాస్తు చేసుకుంది.
● బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు సేకరణ సందర్భంగా ఇచ్చిన గన్నీ బ్యాగులు లారీలు రాకపోవడంతో రెండు రోజులు నీళ్లలో ఉండడం వల్ల 800 బ్యాగులు చెదలు వచ్చి పాడైపోయాయని, వాటిని మార్చి లోనే గోదాంకు తరలించారని, వాటిపై రికన్సలేషన్ ఇచ్చి ఆదుకోవాలని గ్రామైఖ్య సంఘం సభ్యులు పల్లపు దీపారాణి, జంగం మాధవి కలెక్టర్‌ను కోరారు.
● జనగామ మండలం పెద్దరాంచర్ల గ్రామానికి చెందిన మండ్రోజు కర్ణాకర్ పేరు మీద గ్రామశివారులో సర్వే నెంబర్ 87ఏ1లో 32 గుంటలు, 87ఏ2లో 33 గుంటలు 1ఎకరం. 25 గుంటల భూమి ఉంది. 2011 నుంచి కాస్తులో ఉండగా గ్రామానికి చెందిన మరో వ్యక్తి అక్రమంగా తన భూమిలో 12 గుంటల భూమి సాగు చేస్తున్నాడని హద్దులు ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కర్ణాకర్ కోరారు.
ఆదుకోండి సారూ..
ఈఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు కోటి కొమురయ్య. స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రం. ఆయనకు ముగ్గురు కుమార్తెలు కాగా 35 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఎలాంటి ఆస్తుల లేకున్నా కాయ కష్టం చేసి తన ముగ్గురు పిల్లల వివాహాలు చేశారు. తనకు 83 ఏళ్లు ఉండగా ఏపని చేయలేక పోతున్నానని, తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్ మందులకు సరిపోవడం లేదని, బతుకుదెరువుకోసం ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను కోరాడు.


