● అర్ధరాత్రి వరకు బిర్యానీ హోటళ్ల నిర్వహణ
● తాజాగా ఓ రెస్టారెంట్‌లో గొడవపై కలెక్టర్‌కు న్యాయవాది ఫిర్యాదు
జనగామ: పట్టణంలో రాత్రి పది గంటలు దాటితే సాధారణ వ్యాపార సంస్థలు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, టీ కొట్లు మూసివేయిస్తున్న పోలీసులు.. కొన్ని బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు అర్ధరాత్రి 12.30 గంటలు దాటినా తెరిచి ఉండటంపై ఇతర హోటల్ యజ మానులు, స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఒకే నిబంధనలు వర్తించాలా.. కొందరికి ప్రత్యేక మినహాయింపులున్నాయా అని ప్రశ్నిస్తున్నారు.
కలకలం రేపుతున్న నైన్‌డైన్ వివాదం
పట్టణంలోని కురుమవాడ ప్రాంతంలో నైన్ డైన్ రెస్టారెంట్‌లో ఇటీవల అర్ధరాత్రి జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే సీఐ సత్యనారాయణరెడ్డి స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు రెస్టారెంట్లు కొనసాగితే అక్కడికి వచ్చే వ్యక్తులపై నిఘా ఎలా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గొడవలకు బిల్లుల విషయంలో తలెత్తిన వివాదాలే కారణమా.. లేక ఇంకా ఏమైనా కారణాలతో గొడవ జరిగిందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ఆలేటి సిద్ధిరాములు సోమవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఏకశిలా పబ్లిక్ స్కూల్‌కు సమీపంలో ఉన్న నైన్ డైన్ రెస్టారెంట్‌ను అర్ధరాత్రి 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నారని, అందులో కనీసం ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ చిన్న చిన్న గొడవలు జరిగినట్లు తెలిపారు. డ్రెయినేజీ సమస్యతో వ్యర్థాలు రోడ్డుపైకి వస్తున్నాయని, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించాలని, అక్కడ పని చేస్తున్న కార్మికుల వివరాలను పరిశీలించేందుకు లేబర్ అధికారులు రావాలని కోరారు. గృహాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారని, పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్న దానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా హైదరాబాద్, హన్మకొండ, సూర్యాపేట, సిద్దిపేట రోడ్లలోనూ అర్ధరాత్రి వరకు కొనసాగుతున్న రెస్టారెంట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


