● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆరోగ్య శాఖ అధికారులు, ప్రోగ్రాం అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది సమన్వయంతో గర్భిణులందరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి వైద్యపరీక్షలు నిర్వహిస్తూ, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. సాధ్యమైనంత వరకు శస్త్రచికిత్సలను తగ్గించి, వైద్యపరంగా అనుకూలమైన సందర్భాల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. టీబీ వ్యాధికి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు కూడా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వాణిశ్రీ, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రావ్య, మెడికల్ అధికారులు, ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


