ఎకరానికి రూ.20 వేలు ఖర్చు చేశా..
జఫర్‌గఢ్: వర్షాభావ పరిస్థితులకు తోడు ఎరువుల ధరలు పెరగడంతో పత్తి రైతులకు పెట్టుబడి భారం రెట్టింపు అవుతోంది. పంట ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసిన మొదట్లోనే వర్షాలు లేకపోవడం పత్తి సాగుకు ఇబ్బందికరంగా మారింది. విత్తిన చోటనే రెండు మూడు సార్లు విత్తనాలు విత్తడం, కలుపు పెరగడం ఎక్కువ మంది కూలీలు పెట్టడం, గుంటుకల తోలడం తదితర పనుల వల్ల భారం ఎక్కువైంది. దీనికితోడు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఒకేసారి భారీగా పెరగడంతో రైతు కుదేలవుతున్నాడు. ఇప్పటికే పూత, కాత రావాల్సి ఉండగా పత్తి మొక్కల్లో ఎదుగుదల లేదు. కాగా, మండలంలో 12 వేల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది రైతులు వర్షంపైనే ఆధారపడి పంటను వేశారు.
ఎన్నడూ లేనంత ఎరువుల భారం..
కాంప్లెక్స్ ఎరువులైన 2020 బస్తాకు గతంలో రూ.1,250 ఉండగా ప్రస్తుతం రూ.2,150కి అమాంతం పెరిగింది. వీటితో పాటు మిగతా ఎరువుల ధరలు కూడా ఒక్కో బస్తాకు కనీసం రూ.1,000 నుంచి రూ.1,300 వరకు పెరగడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడింది. వీటితో పాటు పురుగుల మందులను పిచికారీ చేస్తుండడంతో ఒక్కో ఎకరాకు ఇప్పటివరకు రూ.17వేల నుంచి రూ.20వేలకు వరకు పెట్టుబడులు పెట్టారు. కాగా పంట చేతికి అందివచ్చే వరకు పెట్టుబడులు మరింత పెరగనుంది. పైగా ఇప్పటివరకు రైతులు అశించిన స్థాయిలో పంట కనిపిండం లేదు. గతేడాది పంట చేతికి అందివచ్చే సమయంలో అధిక వర్షాలు కురియడం వల్ల పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సారైన దిగుబడి రాకపోతుందా అనే ఆశతో ఉన్న రైతులకు నిరాశే ఎదురవుతోంది.
ఓవైపు వర్షాభావంతో ఇబ్బందులు..
మరోవైపు భారీగా పెరిగిన
ఎరువుల ధరలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పూత, కాత లేని పంట
ఆందోళనలో రైతులు
ఈసారి నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. దుక్కులు దున్నడం, విత్తిన చోటే మళ్లీ విత్తనాలు పెట్టడం, కలుపుతీయడం, ఎరువుల కోసం ఇప్పటి వరకు కనీసం రూ. 20 వేల వరకు పెట్టుబడులు పెట్టా. సరైన వర్షాలు లేక పంట ఎదుగుదల లేదు. ఇప్పటికే పూత, కాత దశకు రావాల్సి ఉండగా ఇంకా కలుపు దశలోనే ఉంది. ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడులు ఎక్కువయ్యాయి.
– భూక్య సుధాకర్, రైతు, టీబీతండా


