జనగామ: ఆషాఢ మాస పర్వదినాలు ముగియడంతో ఈనెల 13 (గురు వారం) నుంచి శ్రావణ మా స సందడి మొదలు కానుంది. 14వ తేదీ నుంచి శుభముహూర్తాలు మొదలు కానున్నాయి. శ్రావణ మాసం నుంచి వచ్చే రెండు నెలల కాలంలో శుభకార్యాలకు అనుకూలంగా కేవలం పది శుభముహూర్తాలు మాత్రమే ఉండటంతో వీటికి ప్రాధాన్యం పెరిగింది. ఈనెల 16, 20, 21, 22, 23, 26, 27, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 4, 6 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నట్లు కుటుంబాలు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
శుభకార్యాలతో వ్యాపారాలకు ఊపు
శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో వివాహాలకు సంబంధించిన అన్ని రంగాల్లో వ్యాపార సందడి పెరగనుంది. ఫంక్షన్‌హాళ్లు, కల్యాణ మండపాలు, పురోహితులు, డెకరేషన్‌నిర్వాహకులు, పూల అలంకరణ, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాలు, వివాహ సామగ్రి విక్రయించే వ్యాపారులకు డిమాండ్ పెరగనుంది.
బోనాలు..నోములు..వ్రతాలు
పవిత్ర శ్రావణమాసంలో అన్ని కులాల వారు తమ సంప్రదాయాల ప్రకారం విడతలవారీగా బోనాల జాతరలు నిర్వహించనున్నారు. అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో బోనాల ప్రసాదాన్ని సమర్పించడంతో పాటు ఓడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆయా ఆలయాల్లో నోములు, వ్రతాలు, సామూహిక కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 6వ తేదీ నాటికి శుభ ముహూర్తాలు ముగియనుండగా, తిరిగి నవంబర్ కార్తీక మాసం నుంచి డిసెంబర్ 31 వరకు 45 రోజుల పాటు ఉంటాయని వేద పండితులు ఆరాధ్యశర్మ తెలిపారు. కాగా చివరి ఆషాడమాసం రోజు పట్టణంలో అనేకచోట్ల గోరింటాకు, ఇతర పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
నెలంతా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ
బోనాలు, పెళ్లి ముహూర్తాలు,
గృహప్రవేశాల సందడి
ఊపందుకోనున్న వ్యాపారాలు


