రఘునాథపల్లి: బహుళ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తక్కువ నీటి అవసరముండే పంటలు వేయడం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కోమల్ల గ్రామంలో బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతిలో వివిధ రకాల పంటలు సాగి చేస్తున్న రైతు మంద రాములు వ్యవసాయ క్షేతాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో రైతు చేపడుతున్న సాగు విధానాలు, సాగు నీటి లభ్యత, పంటల నిర్వహణ, దిగుబడులు, మార్కెటింగ్ తదితర అంశాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో మునగ, సపోటా, సీతాఫలం, అరటి, అంజీర్, నిమ్మ వంటి ఉద్యాన పంటలతో పాటు బీరకాయ, సొర కాయ తదితర తీగ జాతి కూరగాయలను ఒకే భూమిలో సాగు చేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించి రైతును అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోని, డీఆర్డీఓ భాస్కర్, కేవీకే శాస్త్రవేత్త రమ్య, డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య, మండల వ్యవసాయాధికారి కర్ణాకర్‌రెడ్డి, ఏఈఓ కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక సాగు పద్ధతులను రైతులకు
చేరువ చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఆధునిక సాగు పద్ధతులను రైతులకు చేరువ చేస్తూ రైతులు సమీకృత సాగు విధానాలను అవలంబిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా సూచించారు. డివిజన్ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైతు ఊరడి లింగయ్య సాగుచేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రైతు ఎనిమిది ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించి రైతుతో పంటసాగు, నీటి వినియోగం, దిగుబడులు, మార్కెటింగ్ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు లింగయ్య పొలంలో ఆధునిక సాగు పద్ధతులను ప్రదర్శించేలా డెమో ప్లాంట్‌ను ఏర్పాటు చేయించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో చిక్కుళ్ల రమేశ్, వెంకన్న అనే రైతులు సాగుచేస్తున్న పొలాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికాసోని, డీఆర్డీఓ భాస్కర్, కేవీకే శాస్త్రవేత్త రమ్య, ఏఓ కరుణాకర్, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కోమల్ల, ఘన్‌పూర్, ఛాగల్లులో రైతుల వ్యవసాయక్షేత్రాల పరిశీలన


