రఘునాథపల్లి: మండలంలోని ఫతేషాపూర్ గ్రామంలో బెల్ట్‌షాపులను వెంటనే మూసివేయాలని ఫతేషాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల మహిళలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేదం అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముందుగా ఫతేషాపూర్ సర్పంచ్ సుజాతను కలిసి గ్రామంలో బెల్ట్‌షాపులు మూసి వేయాలని, గ్రామసభ నిర్వహించి మద్యం విక్రయాలపై నిషేధ తీర్మానం చేయాలని కోరుతూ మహిళలు వినతి పత్రం అందజేశారు. అనంతరం బ్యానర్లతో ర్యాలీ చేపట్టి మద్యం వద్దు..బెల్ట్ షాపులు మూసి వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి నిరసన తెలుపుతూ మద్యం అమ్మకాలు నిలిపి వేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇరు గ్రామాల ఉప సర్పంచ్‌లు చింత నరేష్, గడ్డం సందీప్, వీఓఏలు గాజులపాటి రమాదేవి, ఉమ్మగోని విమల, నూనె వరలక్ష్మి, నల్ల మౌనిక, వార్డు సభ్యులు గాజులపాటి విజయ, చందుపట్ల లక్ష్మి, నూనె ఉప్పలయ్య, రిటైర్డ్ హెచ్‌ఎం శంకరయ్య, మేడిపల్లి నరేష్, గ్యార నరసింగరావు, గ్యార నాగరాజు, జోగు శ్రీధర్, మహేష్, హరీష్, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
బెల్టుషాపు నిర్వాహకుల బైండోవర్
ఫతేషాపూర్‌లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. బెల్టుషాపులు నిర్వహించడం, అక్రమంగా మద్యం విక్రయాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని పోలీసులు వారికి స్పష్టం చేశారు. ఇకపై బెల్టుషాపు నిర్వహించకూడదని హెచ్చరించారు. అనంతరం బెల్టుషాపుల నిర్వాహకులను తహసీల్దార్ రాజేష్‌రెడ్డి ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ తెలిపారు.
ఫతేషాపూర్‌లో ఇరుగ్రామాల మహిళల భారీ ర్యాలీ
మద్యం విక్రయాలు నిలిపివేయాలని హెచ్చరిక


