పనుల నాణ్యతలో రాజీ పడొద్దు | - | Sakshi
Sakshi News home page

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ సుందరీకరణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (ఏడీఆర్‌ఎం) ముత్యాల నాయుడు సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జనగామ రైల్వే స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో కొనసాగుతున్న సుందరీకరణ, పునరుద్ధరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫామ్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, లిఫ్ట్‌లు, ఏసీ వెయిటింగ్‌ హాల్స్‌, ప్రయాణికుల విశ్రాంతి గదులు, ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద చేపడుతున్న సుందరీకరణ పనులు, పార్కింగ్‌ ప్రాంతం, లైటింగ్‌ ఏర్పాట్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. కాగా, పంద్రాగస్టు నాటికి రీమోడలింగ్‌, సుందరీకరణ పనులను పూర్తిచేసి నూతన రూపులో రైల్వే స్టేషన్‌ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మైనార్టీ నాయకుడు అజహరొద్దీన్‌ ఏడీఆర్‌ఎం ముత్యాల నాయుడిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

10న ఆటోల బంద్‌

జనగామ రూరల్‌: ఈనెల 10వ తేదీన జిల్లాలో ఆటోల బంద్‌ చేపట్టనున్నట్లు ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు జేరుపోతుల కుమార్‌ తెలిపారు. గురువారం పట్టణ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు బాల్దే శ్రీశైలం అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ వద్ద ఆటోల బంద్‌ వాల్‌పోస్టల్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయలేదని, ముఖ్యంగా ఓలా, ఉబర్‌, ర్యాపిడో లాంటి సంస్థలను అధికారికంగా నిషేధించాలన్నా రు. ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. మండల అధ్యక్షులు నామాల నరసింహులు గౌడ్‌, తాళ్లపల్లి వెంకటయ్య, బిధాని మల్లేష్‌, మైముద్‌, మంగ శ్రీను, గణిపాక రవి, కర్రె శీను, సత్యనారాయణ, యాకుబ్‌ పాషా, సలీం తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ బోర్డు

ఏర్పాటు చేయాలి

జనగామ రూరల్‌: రాష్ట్రంలోని ఆటో, క్యాబ్‌, లారీ, బస్సు తదితర వాహనాల డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ పబ్లిక్‌–ప్రైవేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కార్యాలయంలో ట్రాన్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు బూడిద ప్రశాంత్‌ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా పుప్పాల శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. డ్రైవర్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్‌ వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలని కోరారు. ఈనెల 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని రవాణా రంగ కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్‌,ఽ ధరావత్‌ మహేందర్‌, శివరాత్రి రాజు, చీర శ్రీనివాస్‌ బూడిద సంపత్‌, ఆత్కూరి ఎల్లయ్య, కాగితాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల పిల్లలకు

100 శాతం ఫీజు రాయితీ

జనగామ: జిల్లాలోని ప్రైవేట్‌ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్‌ జర్నలిస్టుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జిల్లా శాఖ తరపున సెక్రటరీ సురిగెల భిక్షపతి విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులను పరిశీలించి ఫీజు రాయితీ అమలు చేసి, నివేదిక సమర్పించాలని పాఠశాలల యాజమాన్యాలను కలెక్టర్‌ ఆదేశించినట్లు భిక్షపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement