జనగామ: పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్‌పర్సన్ బాలమణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌరసేవలు అందించే దిశగా ప్రతీ శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కాగా, మున్సిపాలిటీ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కా ర్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్ధి పనులు తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులు మాట్లాడారు. సమావేశంలో 49 ఎజెండా అంశాలను కౌన్సిల్ ముందుంచగా, వాటిలో 47 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. మరో రెండు ఎజెండా అంశాలను తదుపరి పరిశీలన కోసం నిలిపివేశారు.
పలు అంశాలపై చర్చ..
వార్డుల అభివృద్ధి, మౌలిక వసతులు, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. మెడికల్ కళాశాలతో పాటు ఎంసీహెచ్‌లో అంతర్గత రహదారుల నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి రూ.25 లక్షల నిధులు కేటాయించడంపై పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, దీనిపై సమావేశంలో చర్చ జరిగింది. పెంబర్తి–జనగామ బైపాస్ రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. గత ఐదు సమావేశాలుగా 25వ వార్డుకు సంబంధించిన లైబ్రరీ, మహిళల కమ్యూనిటీ హాల్ నిర్మాణ అంశాలను ఎజెండాలో చేర్చకపోవడంపై 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్‌లో భాగంగా కౌన్సిలర్లకు ట్యాబ్‌లు అందించాలని, గాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్ సమస్యలను నివారించే చర్యలు చేపట్టాలని పలువురు కోరారు. అలాగే మహంకాళి దేవాలయంలో బోనాల పండుగ నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణిశ్రీనివాస్
కౌన్సిల్ సమావేశంలో 47 ఎజెండా అంశాలకు ఆమోదం


