అడుగంటుతున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

అడుగంటుతున్న ఆశలు

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

వానల కోసం వేయికళ్లతో అన్నదాతల ఎదురుచూపు

మూడు బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు

జఫర్‌గడ్‌ మండలం రేగడి తండా గ్రామ శివారు టీబీ తండాకు చెందిన రైతు భూక్య రవీందర్‌ తనకు ఉన్న నాలుగు ఎకరాల్లో 3 ఎకరాల్లో పత్తి, మరో ఎకరంలో వరి సాగు కోసం నారు సిద్ధం చేసి ఉంచాడు. పెట్టుబడులకు రూ.35వేల వరకు ఖర్చు చేశాడు. వర్షాలు లేకపోవడం, ఉన్న ఒక్క బోరు ఒట్టిపోవడంతో పంటల కోసం రూ.2.50లక్షలు ఖర్చు చేసి 5వందల ఫీట్లకు పైగా మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు.

జనగామ మండలం గోపిరాజుపల్లిలో బీళ్లుబారిన పొలంలో వరణుడి కోసం ఎదురు చూస్తున్న మహిళా రైతు

కౌలు రైతు కష్టాలు

తరిగొప్పుల మండలం మరియపురానికి చెందిన కౌలు రైతు రాజబోయిన చిన్ను పత్తి చేనులో గుంటుక తోలుతూ అక్కడక్కడ మొలిసిన పత్తి మొక్కలను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎకరాకు రూ.18 వేల చొప్పున కౌలు చెల్లిస్తూ వ్యవసాయం చేస్తున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలకు తోడు చెరువుకుంటల్లో కొద్దిపాటి నీటి నిల్వలు ఉండడంతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు.

జిల్లాలో పంటల సాగు అంచనా (ఎకరాల్లో)

పంట అంచనా ప్రస్తుత సాగు

వరి 95,653 68,000

పత్తి 1,38,000 92,500

కందులు 2,305 2,500

మొక్కజొన్న 8,000 3,100

పెసర్లు 562 350

ఇతర పంటలు 1,180 2,090

2,15,700 1,68,540

జనగామ: కరువు కబంధ హస్తాల్లో వ్యవసాయం కొట్టుమిట్టాడుతోంది. తక్కువ వర్షపాతం, అడుగంటిన చెరువులు, ఎండిపోతున్న పంటలు, ప్రమాదకర భూగర్భ జలాలతో జిల్లా తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంటోంది. రైతుల ఆశలన్నీ ఇప్పుడు వరణుడి కరుణపైనే నిలిచాయి. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటలు కలిపి ఈ సీజన్‌లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు సుమారు 1.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. ఈ సాగు కూడా నార్లు, విత్తన దశలోనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరి నార్లు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడంతో సాగు పనులు ముం దుకు సాగడం లేదు.

వర్షపాతం తక్కువే

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడం, చెరువులు అడుగంటిపోవడం, బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 770 చెరువులు ఉన్న జిల్లాలో ఏ ఒక్క చెరువులోనూ 25 శాతం నీటి నిల్వలు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రిజర్వాయర్లలో కూడా నీటి నిల్వలు సగానికి తగ్గిపోయాయి.

వరి, పత్తి పంటలకు కరువు ఛాయలు

వరి, పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటల కాలం దాటి పోతుండడంతో 10 ఎకరాల్లో సాగు చేయాలనుకున్న రైతులు ఒకటి లేదా రెండు ఎకరాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. వాటికి కూడా సాగునీరు అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రాంతాల్లో బకెట్లు, ట్రాక్టర్లు, పైపులైన్ల ద్వారా మొక్కలకు నీరు అందిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, వరికి భారీ పైపు లైన్లను ఏర్పాటు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ప్రస్తుతం ఐదు నుంచి ఎనిమిది అడుగుల వరకు పెరగాల్సిన పత్తి మొక్కలు అడుగు ఎత్తు కూడా పెరగక వాడిపోతున్నాయి. వందల ఎకరాల్లో రెండోసారి, మూడోసారి విత్తనాలు వేసినా ఆశించిన ఫలితం లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. అయితే రాత్రి వేళల్లో విద్యుత్‌ సరఫరా సరిగా లేకపోవడం, ఉదయం తరచూ ట్రిప్‌ అవుతుండడంతో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా వినియోగించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనేక మంది రైతులు అప్పులు చేసి 500 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు కూడా పడక లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు నేడు పగుళ్లతో కనిపిస్తుండటంతో 1996 కరువు రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.

లోటు వర్షపాతం

జిల్లాలో ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. జూన్‌లో సాధారణంగా 124.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 88.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 29 శాతం లోటు నమోదైంది. జూలైలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాధారణంగా 102.7 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, 47.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 54 శాతం లోటు ఏర్పడింది.

ఎల్‌నినో కోరలు..సాగుపై తీవ్ర ప్రభావం

నీరులేక ఎండుతున్న పొలాలు..

బోసిపోతున్న చెరువులు..

వట్టిపోయిన బోర్లు

పంటలను బతికించుకునేందుకు

రైతుల ప్రయాస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement