జనగామ: జిల్లా వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 12 చేనేత సహకార సంఘాలు ఉండగా, వాటిలో 9 సంఘాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన మూడు సంఘాలైన జిల్లా కేంద్రంలోని భారత్ టీసీ జెడ్ బీహెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, జనగామ సంజయ్‌నగర్ ప్రాజెక్టు హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, పాలకుర్తి మండలం గూడూరు హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్‌లలో ఎన్నికలు నిర్వహించారు. గూడూరు సంఘంలో ఇద్దరు మహిళా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన ఏడుగురు పురుష సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. జనగామలో ఎన్నికల ప్రచారం, పోలింగ్ పంచాయతీ ఎన్నికలను తలపించేలా సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించగా, అనంతరం గంటపాటు భోజన విరామం ఇచ్చి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపి రి పీల్చుకున్నారు. ఎన్నికై న పాలకవర్గ సభ్యులు మూడు రోజుల్లోగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు పాలకమండలిని ఎన్నుకోనున్నారు.


