జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, త్రైమాసిక తనిఖీలో భాగంగా శుక్రవారం సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జీడికల్ ఆలయానికి
రూ.2 లక్షల విరాళం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో దివ్యవిమాన రథోత్సవానికి సంపంగి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రూ.2లక్షల విరాళం అందజేశారు. గతంలో కార్పెంటర్ శంకరాచారికి అడ్వాన్స్‌గా రూ.1,16,000 ఇవ్వగా మొత్తం రూ.3,16,000లు రథం తయారీకి అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వంశీ, దేవస్థాన చైర్మన్ మూర్తి, సిబ్బంది భరత్, అర్చకులు భార్గవాచార్యులు తదితరులు ఉన్నారు.
డిజిటలైజేషన్ ప్రక్రియ
వేగవంతం చేయాలి
జనగామ రూరల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కార్యదర్శి నవీన్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి ఈ నెల 24 తేదీ నాటికి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ..ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 99.6 శాతం, డిజిటలైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తయిందన్నారు.
రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య బాధాకరం
జనగామ రూరల్: ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్‌మెంట్ బకాయిలు అందక మానసిక వేధనతో విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఆయన ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్లయ్య కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సొసైటీ పెట్రోల్ బంక్ సీజ్
కొడకండ్ల: మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం పెట్రోల్ బంక్‌ను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ కిరణ్‌ప్రకాశ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్‌బాబు బంక్‌ను సీజ్ చేయడంతో పాటు సేల్స్‌కు సంబంధించిన ‘బీ’ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. సొసైటీ భూమికి సంబంధించిన పత్రాలు సరిగా లేనందునే బంక్‌ను సీజ్ చేసి లైసెన్స్‌ను రద్దు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ భూమికి సంబంధించిన ఆధారాలు, రికార్డులను అందజేయాలని జూన్ 27న రెవెన్యూ అధికారులు సొసైటీకి నోటీసులు అందజేయగా గడువు కోరారు. 30వ తేదీ న బంక్‌లో సేల్స్‌ను నిలిపివేస్తూ జూలై 7 వరకు రికార్డులు సమర్పించేందుకు రెవెన్యూ అధికారులు సొసైటీకి గడువిచ్చారు. నిర్దేశించిన గడువులోగా భూమికి సంబంధించిన రికార్డులను కలెక్టర్‌కు అందజేసినట్లు ఎండీ నరేష్ తెలిపారు. షోకాజ్ నోటీస్‌పై సొసైటీ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.


