జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా అందించే రెండు జతల యూనిఫాం పంపిణీ ప్రక్రియ ఈసారి అస్తవ్యస్తంగా మారింది. పాఠ్యపుస్తకాలతో పాటు ఇవ్వాల్సి ఉండగా పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పటివరకు యూనిఫాం కోసం అవసరమైన క్లాత్(వస్త్రం) జిల్లాలకు పూర్తిస్థాయిలో చేరలేదు. అయితే వచ్చిన వస్త్రంతో కుట్టు పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతోంది. దీంతో పిల్లలు పాత యూనిఫాంలతో లేదా రంగు దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు.
నత్తనడకన కుట్టు పనులు
సాధారణంగా ఏటా మార్చిలోనే విద్యార్థుల కొలతలు సేకరించి, ఏప్రిల్, మే నెలల్లో క్లాత్‌ను మండల కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు అందిస్తారు. వారు దుస్తులు కుట్టి పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తారు. కానీ వస్త్రం ఆలస్యంగా వచ్చింది. ఒక్కో డ్రెస్ కుట్టినందుకు రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 6వేల దుస్తులను 399 మంది మహిళా సంఘాల ద్వారా సిద్ధం చేసినట్లు, ఈనెల చివరికల్లా అందేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
స్పష్టత రాని ఎడ్యుకేషన్ కిట్
ఈ ఏడాది నుంచి యూనిఫాంలతో పాటు 24 వస్తువులతో కూడిన ‘ఎడ్యుకేషన్ కిట్’ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 15 నాటికి అన్ని పాఠశాలలకు కిట్లు చేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వాటి పంపిణీ కూడా ప్రారంభం కాలేదు. అధికారులు తక్షణమే యూనిఫాంలు, కిట్ పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థులకు నీలం రంగు దుస్తులు
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలం విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం కలర్ మార్చింది. గతేడాది రెడ్ అండ్ యాష్ కలర్‌లో ఉంది. ఈ సారి లేత నీలం రంగుగా మార్చారు. బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీలంరంగు నిక్కర్ లేదా ప్యాంటు, బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్ తరగతుల వారీగా అందించనుంది.
తక్షణం యూనిఫాంలు,
కిట్ అందించాలి
పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. నేటికీ విద్యార్థులకు యూనిఫాం అందకపోవడం బాధాకరం. యూనిఫాంలతో పాటు ఎడ్యుకేషన్ కిట్‌ను తక్షణమే అందించాలి. లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతాం.
–పోదల లవకుమార్,
జిల్లా అధ్యక్షుడు, ఎస్‌ఎఫ్‌ఐ
స్కూళ్ల ప్రారంభం రోజే యూనిఫాంలు ఇస్తామన్న ప్రభుత్వం
ఇప్పటి వరకు 6వేల వరకే
యూనిఫాంలు సిద్ధం
నత్తనడకన సాగుతున్న కుట్టుపనులు
జిల్లా వ్యాప్తంగా 27 వేలకుపైగా
విద్యార్థులు
స్పష్టత లేని ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ
మొత్తం విద్యార్థులు: 27,768 మంది
యూనిఫాంల అవసరం: 55 వేలు
యూడైస్ ప్రకారం మొత్తం పాఠశాలలు: 503
ఎస్‌హెచ్‌జీ మహిళలు: 399 మంది
ఇప్పటివరకు సిద్ధమైన యూనిఫాంలు: 6000


