న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026
‘దిక్సూచి’ సొమ్ము
జనగామ: విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం రూపొందించిన దిక్సూచి పుస్తకాల వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే అధ్యయన సామగ్రి పేరుతో జిల్లాలో రూ.46.50 లక్షల భారీ మొత్తంలో నిధులు వెచ్చించినట్టు రికార్డులు చూపుతున్నప్పటికీ, పుస్తకాలు మాత్రం విద్యార్థుల చేతికి చేరలేదు. అవసరానికి మించి ఆర్డర్లు, నిబంధనల ఉల్లంఘన, అనుమానాస్పద చెల్లింపులు, అధికారు ల పాత్రపై ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి. తాజాగా నమోదైన కేసుతో దర్యాప్తు ముందుకు సాగుతుండగా, నిధుల వినియోగం, నిర్ణయాల వెనుక ఉన్న బాధ్యులు, అక్రమాల పరిమాణం ఏమిటన్న అంశాలపై అధికా ర యంత్రాంగం లోతుగా విచారణ చేపట్టింది. సంబంధిత అధికారులపై కేసు నమోదవగా, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.
ముందుగానే అక్రమాలకు ప్లాన్ చేశారా?
పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో అప్పటి జిల్లా పాలనాధికారుల ఆదేశాల మేరకు ‘దిక్సూచి‘ పుస్తకాల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు, మార్గదర్శక సమాచారాన్ని అందించేలా పుస్తకాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. అయితే పరీక్షల సమయం ముగిసే వరకు పుస్తకాలు విద్యార్థులకు అందించలేదు. ఈ వ్యవహారంలో అత్యంత అనుమానాస్పద అంశం ఏమిటంటే, జిల్లాలో సుమారు 4,635 మంది పదో తరగతి విద్యార్థులు మాత్రమే ఉండగా, 15 వేల పుస్తకాల ముద్రణకు ఆర్డర్ ఇచ్చినట్లు రికార్డు చూపించారు. అవసరానికి మించి పుస్తకాల సంఖ్యను చూపించడం ద్వారా ముందుగానే అక్రమాలకు ప్రణాళిక రూపొందించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకెంతమంది ఉన్నారు
ప్రభుత్వ నిధులతో ఇంత పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేపట్టే సమయంలో టెండర్ ప్రక్రియ నిర్వహించడం, సంబంధిత శాఖల అనుమతులు పొందడం, అధికారిక నోటు సిద్ధం చేయడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో అలాంటి విధానాలు సక్రమంగా అనుసరించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుస్తకాలు ముద్రించకుండానే ఖర్చు చూపించి నిధులు దుర్వినియోగం చేశారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ కేసులో అప్పటి కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్ కీలకపాత్ర పోషించగా, ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరో ఇద్దరి ప్రమేయం ఉండగా, ఇంకా ఎంతమంది ఉన్నారనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది.
మొదలైన పోలీసుల దర్యాప్తు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ శాఖల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యాశాఖలో జరిగిన ఈ భారీ అక్రమాలపై లోతైన విచా రణకు ఆదేశించారు. ఇప్పటికే పోలీసు దర్యాప్తు ప్రారంభమవగా, నిధుల విడుదల నుంచి ఖర్చు వరకు ప్రతీ అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రింట్‌కాని పుస్తకాలకు ప్రభుత్వ నిధులు
మొదలైన పోలీసుల విచారణ
కీలకపాత్రలో అప్పటి కలెక్టరేట్
ఏఓ
టెండర్లు లేకుండానే..అడ్డగోలు దోపిడీ
చర్చనీయాంశంగా మారిన
గత అధికారుల తీరు


