జనగామ రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు అర్జీదారులు పోటెత్తారు. ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ 510 దరఖాస్తులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చినకోట్యానాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని ఇలా..
● పాలకుర్తి గూడూరు గ్రామానికి చెందిన కాసోజు భీష్మాచారి తనకు పుట్టుకతో పోలియోతో రెండు కాళ్లు పోయాయని, వచ్చే పెన్షన్‌తో అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నానని, మూడు చక్రాల స్కూటీ అందించాలని వేడుకున్నారు.
● తరిగొప్పుల మండలానికి చెందిన మామిడాల కల్పన, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గుర్తించి, ఆర్థిక సహాయం అందజేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
● జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామానికి చెందిన శానబోయిన తిరుమలేష్, సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసినా కూడా మొదటి విడతలో ఇల్లు రాలేదని, రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
● లింగాల ఘణపురం మండలం జీడికల్ గ్రామానికి చెందిన నల్ల నాగమణి, నిరుపేద కుటుంబానికి చెందినవారమని, అద్దె ఇట్లో ఉంటు కాలం వెల్లదిస్తున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని విన్నవించారు.
● జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన మారగోని లక్ష్మి, చిన్న పెంకుటిల్లు కూలిపోయే దశలో ఉందని, తనకు ఎవరూ లేరని, వితంతువు ఒంటరి మహిళనని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
● దేవరుప్పుల మండలానికి చెందిన గునుపాక నవీన్, తన ఒక ఎకరం 20 గుంటల భూమికి సంబంధించి పట్టా పాస్ బుక్ ఇప్పించాలని అధికారుల చుట్టు తిరిగిన ఫలితం లేదని తనకు న్యాయం చేయాలని కోరారు.
కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో అధిక అర్జీలు ఇవే
సమస్యల పరిష్కరించాలంటూ
తరలివచ్చిన ప్రజలు
510 దరఖాస్తులు స్వీకరించిన
కలెక్టర్, అధికారులు
చనిపోయానని చెప్పి భూమి కాజేశారు
మాది ఆగాపేట గ్రామం. మా తండ్రి బొక్క ప్రకాశం పేరు మీద సర్వేనంబర్ 521బై 45,46,47,48 లో 2.36 గుంటల తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇనాం భూమి ఉంది. గ్రామానికి చెందిన కొంతమంది తాను చనిపోయాయని, తనకు వారసులు ఎవరూ లేరని భూమి గ్రామ పంచాయతీకి అప్పగించాలని పత్రం ఉందంటూ భూమిని కాజేయాలని చూస్తున్నారు. ఏళ్ల తరబడి భూమిపై జీవిస్తున్నా. నాకు న్యాయం చేయాలి.
–బొక్క సుధాకర్, ఆగాపేట, నర్మెట


