రిజర్వేషన్.. టెన్షన్
● అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో
పెరుగుతున్న పోటీ
● ముదురుతున్న అంతర్గత పోటీ
● సీటు తమదేనని ఆశావహుల ప్రచారం
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లపై అంతా ఆసక్తి
జనగామ: పురపాలక ఎన్నికల ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈనెల 12న తుది ఓటర్ జాబితా విడుదల కానుండటంతో రాజకీయ పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మున్సిపాలిటీలు, వా ర్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుపై త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు వెల్లడించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
పోటీ పెరిగే అవకాశం
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏ వార్డులో ఏ కేటగిరీ రిజర్వేషన్ కలిసి వస్తుందో అనేదాని ఆధారంగా పోటీ ప్రణాళికలు రూపొందించుకునేందుకు నాయకులు ముందుగానే ప్రజలతో మమేకమవుతున్నారు. వార్డుల వారీగా ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతుండటంతో పార్టీల్లో పోటీ పెరిగే అవకాశం లేకపోలేదు.
రెండు పురపాలికల్లో..
జనగామ మున్సిపల్ పరిధిలో 30, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 18 రెండింట్లో కలుపుకుని 48 వార్డులు ఉన్నాయి. ఈ రెండు పట్టణాల్లోనూ పార్టీల కార్యకర్తలు, ఆశావాహులు ఎవరు ఏ వార్డులో పోటీ చేస్తారనే దానిపై అంతర్గత చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలలో కొంత మంది ఆశావాహులు తమకు సీటు ఖరారైందన్న నమ్మకంతోనే ప్రజలతో ప్రచారం ప్రారంభించారు. అయితే అదే వార్డుల్లో మరికొంత మంది పోటీకి రెడీ అవుతుండటంతో స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికలను అనుసరించే అవకాశం ఉందని ఆశావాహులు భావిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చేవరకు అనిశ్చితి ఉంటుందని భావిస్తున్నారు. కలెక్టర్లు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా, మున్సిపల్ చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించనుంది. ప్రభుత్వం విడుదల చేసే షెడ్యూల్ ఆధారంగానే ఎన్నికల కమిషన్ తుది ఎన్నికల గెజిట్ ప్రకటించే అవకాశముంది.
అధికారులు సిద్ధం
రాబోయే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, సిబ్బంది నియామకం వంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఫీల్డ్ స్థాయిలో మున్సిపాలిటీ సిబ్బందికి అవసరమైన సరంజామా సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన వెంటనే రాజకీయ సమీకరణాలు, పోటీ సర్దుబాట్లు భారీగా మారే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అన్ని పార్టీల్లో నూ ఊహాగానాలు, లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
12న తుది ఓటరు జాబితా
ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణపై గడువు పెంచడంతో ఈ నెల12న తుది ఓటరు జాబితా వెలువరించనున్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలో ఓటరు జాబితాపై పెద్దఎత్తున అభ్యంతరాలు వస్తున్న సంగతి తెలిసిందే. వార్డుల మార్పు, చనిపోయిన వ్యక్తులు, ఓట్లు మిస్సింగ్, వందల సంఖ్యలో అదనంగా కలవడం తదితర అభ్యంతరాలు పెద్ద ఎత్తున రాగా, వారిని సరిచేయాల్సి ఉంది. ఈనెల 10న(శనివారం)తో అభ్యంతరాల స్వీకరణ ముగియనుండగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓటు జాబితాలో ఓట్లు మిస్సైన వారు ఆందోళన చెందుతున్నారు.
రిజర్వేషన్.. టెన్షన్
రిజర్వేషన్.. టెన్షన్
రిజర్వేషన్.. టెన్షన్
రిజర్వేషన్.. టెన్షన్
రిజర్వేషన్.. టెన్షన్


