జాతర టెండర్లు రసాభాస!
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని ఇప్పగూడెం, రంగరాయగూడెం, కోమటిగూడెం, అక్కపెల్లిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని చింతగట్టు శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర టెండర్లు రసాభాస మధ్య జరిగాయి. జాతర ప్రాంగణం వద్ద దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల సర్పంచ్‌ల సమక్షంలో చేపట్టిన వేలం పాటలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగాయి. అయితే గత జాతరకు సంబంధించిన లెక్కల విషయమై, జాతరలో టెండర్లలో నిబంధనల విషయమై పలుమార్లు వాగ్వాదాలు కాగా టెండర్లు రసాభాసగా సాగాయి. ఒక గ్రామం వారు మరో గ్రామంలో టెండర్లలో పాల్గొనడంపై వాగ్వాదాలు జరిగాయి. అయితే ఎస్‌ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసుబందోబస్తు మధ్య ఎట్టకేలకు టెండర్లు ముగిశాయి.
టెండర్ల ఆదాయం రూ.17.60లక్షలు
మొత్తంగా టెండర్ల ద్వారా జాతర ఆదాయం రూ.17.60లక్షలు వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 10 నుంచి నెలరోజుల పాటు ఉండే టెండర్ల విషయమై కొబ్బరికాయలు– బెల్లం(బంగారం), కోళ్లు, మద్యం(కూల్‌డ్రింక్స్) విక్రయించేందుకు నాలుగు గ్రామాల వారీగా, జాతర ప్రాంగణంలో విక్రయించేందుకు వేర్వేరుగా టెండర్లు నిర్వహించారు. జాతర ప్రాంగణంలో మద్యం విక్రయించేందుకు రమణారెడ్డి రూ.4.12లక్షలతో, కోళ్లు విక్రయించేందుకు ఐత రమేష్ రూ.2 లక్షలు, కొబ్బరికాయలు, బెల్లం విక్రయించేందుకు మొలుగూరి కిషన్ రూ.2.01లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. అదేవిధంగా ఇప్పగూడెం, కోమటిగూడెం, రంగరాయగూడెం, అక్కపెల్లిగూడెం గ్రామాల్లో విక్రయాల కోసం టెండర్లను నిర్వహించారు. మొత్తంగా టెండర్ల ఆదాయం రూ.17.60 లక్షలు వచ్చాయని ఈఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. గత జాతర ఆదాయం రూ.9.73లక్షలు కాగా ప్రస్తుతం రూ.17.60లక్షలు కావడం విశేషం. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అఽధికారులు, సిబ్బంది మోహన్, వెంకటయ్య, వీరన్న, సర్పంచ్‌లు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, మందపురం రాణి, సోమేశ్వర్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ బందోబస్తు మధ్య ఇప్పగూడెం జాతర టెండర్లు
పోలీసులు వారించడంతో ముగిసిన వాగ్వాదాలు
మొత్తం టెండర్ల ఆదాయం
రూ.17.60 లక్షలు
జాతర టెండర్లు రసాభాస!


