వేతనాల్లేవ్..పండుగెట్లా?
● వేతనాలు లేక ఈ–పంచాయతీ
ఆపరేటర్ల ఇక్కట్లు
● పెరిగిన ధరలు.. కుటుంబ పోషణకు కుస్తీ
● అదనపు కలెక్టర్, డీపీఓలకు వినతి
జనగామ: సంక్రాంతి పండుగ వేళ ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల జీవితం పస్తులుండే పరిస్థితికి చేరింది. నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో నిరాశలో మునిగిపోయారు.
280 పంచాయతీలు..32 మంది ఆపరేటర్లు
జిల్లాలోని 280 పంచాయతీల పరిధిలో 32 మంది ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.22,750 వేతనం అందిస్తున్నారు. నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పడిపోవడంతో.. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో బతుకే భారమైందని వాపోతున్నారు. గ్రామపంచాయతీల రిపోర్టులు, ఎన్నికలకు సంబంధించిన డేటా ఎంట్రీ, ఓటర్ లిస్టుల సిద్ధం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ వంటి కీలక పనులన్నీ ఈ పంచాయతీ ఆపరేటర్లే చేయాల్సి ఉంటుంది. జీపీ పరిపాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న వీరికి నెలనెల వేతనాలు చెల్లించడంతో మాత్రం జాప్యం చేస్తున్నారు. వేతనాల విషయమై కమిషనర్ కార్యాలయానికి జిల్లా అధికారులు సరైన సమాచారాన్ని పంపకపోవడమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఆపరేటర్లు తమ సమస్యలను వివరిస్తూ స్థానిక సంస్థల తరపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఇనన్‌చార్జ్ డీపీఓ వసంతకు శుక్రవారం అందించారు. వేతనాలు తక్షణమే బ్యాంకు ఖాతాల్లో జమ చేసి తమ జీవితాల్లో వెలుగు నింపాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.


