విద్యకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
జఫర్‌గఢ్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కోనాయిచలం రెవెన్యూ గ్రామంలోని దుర్గ్యానాయక్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.200 కోట్లతో నూతనంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శనివారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, రాష్ట్ర ఈడబ్య్లూ ఐడీసీ ఎండీ గణపతిరెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణలో అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్నాయని, ఇవి తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఏర్పాటు కావడం గర్వంగా ఉందన్నారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు. 18 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయించి నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తానన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓ చీడపురుగు ఉందని, చెత్త మాటలు మాట్లాడుడే తప్పా.. నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదంటూ రాజయ్యను ఉద్దేశించి విమర్శించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్‌గా నిలవబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్‌రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, అధికారులు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వాన్‌బాషాతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ


