సీఎం కప్ క్రీడలను విజయవంతం చేయాలి
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న సీఎం కప్ 2025ను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సీఎం కప్ క్రీడాజ్యోతిని ప్రారంభించారు. పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కువ మంది క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కె.కోదండరాములు, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండారి చేతన్ నితిన్, క్రీడాకారులు, యువత, క్రీడా సంఘాల సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు ఆలేటి ఎల్లవ్వ జాతర వేలంపాట
పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెర గ్రామంలో ఈనెల 16న నిర్వహించే ఆలేటి ఎల్లవ్వ జాతరలో వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ జిట్టబోయిన రమ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయలు అమ్ముకొనేందుకు, వాహనాల పార్కింగ్, దుకాణాలు, స్పెషల్ దర్శనం టికెట్, అమ్మవారి ప్రసాదం కోసం శనివారం ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణంలో వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రూ.4లక్షల విలువచేసే దుస్తుల పంపిణీ
జనగామ: పట్టణంలోని రైల్వేస్టేషన్ ఏరియా ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలోని 250 మంది విద్యార్థినులకు ప్రముఖ వ్యాపారి గజ్జి మధు రూ.4లక్షల విలువ చేసే దుస్తులను పంపిణీ చేశారు. శుక్రవారం కళాశాలలో సీడీసీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వ్యాపారి మధు పాల్గొన్నారు. గట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పది సంవత్సరాలుగా ఏటా సంక్రాంతి పండగను పురస్కరించుకుని అత్యంత విలువైన దుస్తులను పిల్లలకు అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం వ్యాపారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ కమిటీ సభ్యులు పజ్జురి గోపయ్య, బెలిదె శ్రీధర్, వెంకటరమణ, కృష్ణ జీవన్‌బజాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నేడు భూమిపూజ
జఫర్‌గఢ్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈనెల 10న (శనివారం) భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 28 మంజూరు చేయగా ఇందులో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని జఫర్‌గఢ్ మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఆక్టోబర్ 10, 2024న జారీ చేసింది. సుమారు రూ.200 కోట్లతో 21 ఎకరాల ప్రభుత్వ స్థలంలో స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని గతంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేయడంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని కోనాయిచలం రెవెన్యూ పరిధిలోని ప్రధాన రహదారిని అనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సంబంధిత అధికారులు సిద్ధం చేశారు.
సీఎం కప్ క్రీడలను విజయవంతం చేయాలి
సీఎం కప్ క్రీడలను విజయవంతం చేయాలి


