బడి గదిలో.. పంచాయతీ!
పాలకుర్తి టౌన్: మండలంలోని భీక్యానాయక్ పెద్దతండా..గ్రామ పంచాయతీగా ఏర్పడి ఏడు సంవత్సరాలు దాటింది. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు పక్కా భవనాన్ని నిర్మించలేదు. దీంతో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే పంచాయతీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పాఠశాలలో ఉన్నవే రెండు గదులు, ఓ గదిలో అంగన్‌వాడి కేంద్రం నిర్వహిస్తుంటే..మరో గదిని గ్రామ పంచాయతీకి వినియోగిస్తున్నారు. ఇందులో నిర్వహిస్తున్న పాఠశాలను విద్యార్థులు తక్కువగా ఉండడంతో సర్దుబాటులో భాగంగా ఎత్తివేశారు. దీంతో పాఠశాల భవనంలోనే అంగన్‌వాడీ, గ్రామపంచాయతీని నిర్వహిస్తున్నారు. ఒకటే గది కావడంతో గ్రామపంచాయతీ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొత్త పాలకవర్గాలు ఎన్నికై న సందర్భంగా ప్రభుత్వాలు సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


