వ్యవసాయ సంక్షోభంతోనే రైతుల ఆత్మహత్యలు
● మానవ హక్కుల వేదిక రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య
జఫర్‌గఢ్: వ్యవసాయరంగ సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలే నిదర్శనమని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య అన్నారు. గురువారం మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మానవ హక్కుల వేదిక బృందం కలిసి వివరాలు సేకరించింది. ఈసందర్భంగా తిడుగు గ్రామానికి చెందిన బొబ్బల రాజు, హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన మందపురి రవి గౌడ్, మండల కేంద్రానికి చెందిన కాలువ రాజు కుటుంబాలను బృందం పరామర్శించి, వివరాలు నమోదు చేసుకుంది. ఈసందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ..ఈ రైతులందరూ మూడు సంవత్సరాలుగా ఆశించిన పంట దిగుబడి రాక ఏటికేడు నష్టాల పాలై కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టి.హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అద్దునూరి యాదగిరి, ప్రధాన కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


