అవే బారులు..తప్పని తిప్పలు
స్టేషన్ ఘన్‌పూర్: అన్నదాతలకు యూరియా కష్టాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్స్ యాప్‌లో బుక్ చేసుకున్నా రైతులకు అవే కష్టాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని కృష్ణ ఫర్టిలైజర్స్ షాపు ఎదుట రైతులు యూరియా కోసం గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిల్చున్నారు. ఫర్టిలైజర్స్ యాప్‌లో బుధవారం సాయంత్రం స్టేషన్‌ఘన్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల మండలాల రైతులు యూరియా బస్తాల కోసం కృష్ణ ఫర్టిలైజర్స్‌లో బుక్ చేసుకున్నారు. తెల్లారి ఉదయం 8 గంటల ప్రాంతంలో వివిధ గ్రామాల నుంచి రైతులు షాపు వద్దకు చేరుకోగా ఇప్పుడు ఇవ్వడం లేదని, మధ్యాహ్నం ఇస్తామని యజమాని తెలుపడంతో రైతులు వెనుదిరిగారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు వస్తే మరో రెండు గంటలు ఆగాలని చెప్పడంతో షాపు యజమానితో రైతులు వాగ్వాదానికి దిగారు. తీరా మధ్యాహ్నం 3 గంటల నుంచి యూరియా బస్తాలు పంపిణీ చేయగా లైన్లలో రైతుల మధ్య తోపులాట జరిగింది. బుక్ చేసుకున్న 24 గంటలలోపు తీసుకోవాలని, లేనిపక్షంలో బస్తాలు రావనే ఉద్దేశ్యంతో రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో రైతుల ఽమధ్య తోపులాటలు జరిగాయి.
లింక్ పెట్టడంపై రైతుల ఆవేదన
యూరియా బస్తాలకు డీఏపీ, పొటాష్, నానో యూరియా లింక్ పెట్టడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక రైతుకు మూడు బస్తాలు యూరియా ఇస్తే తప్పనిసరిగా ఒకటి, రెండు బాటిళ్ల నానో యూరియా తీసుకోవాలని లింక్ పెడుతున్నారని రైతులు ఆరోపించారు. యూరియా బస్తాకు రూ.266 బిల్లు రాస్తూ ఒక్కొక్క బస్తాకు రూ.300 తీసుకుంటున్నారని వాపోయారు. స్థానిక కృష్ణ ఫర్టిలైజర్స్ షాపు వద్ద యూరియా కోసం రైతుల తోపులాటలు, వాగ్వాదాలతో ఉద్రిక్తత నెలకొన్నా పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడం విడ్డూరం.
యూరియాకు లింక్ పెట్టడం సరికాదు
యూరియా బస్తాల కోసం వచ్చిన రైతులకు పొటాష్, డీఏపీ, నానో యూరియా లింక్ పెట్టడం సరైంది కాదు. రైతుల యూరియా కష్టాలు తీర్చేందుకు ఫర్టిలైజర్స్ యాప్ పెట్టిన ప్రభుత్వం, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ చేపట్టాలి.
–ఈదులకంటి రాజు, రైతు
సాయంత్రం వరకు లైన్‌లోనే ఉన్నా..
మాది జఫర్‌గడ్ మండలం తిమ్మంపేట గ్రామం. శివునిపల్లిలోని ఫర్టిలైజర్స్ షాపు వద్ద మూడు బస్తాల యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా. ఉదయం వస్తే మధ్యాహ్నం ఇస్తామన్నారు. మధ్యాహ్నం వచ్చేసరికి రైతులు లైన్లలో ఉండటంతో సాయంత్రం వరకు ఉండాల్సి వచ్చింది.
–మంద రాములు, రైతు
ఫర్టిలైజర్ యాప్‌లో బుక్ చేసుకున్నా తీరని యూరియా కష్టాలు
పొటాష్, డీఏపీ లింక్ పెడుతున్న
ఫర్టిలైజర్ షాపుల వ్యాపారులు
పట్టించుకోని అధికారులు
అవే బారులు..తప్పని తిప్పలు
అవే బారులు..తప్పని తిప్పలు


