
అప్రమత్తతే రక్ష..
మండపాలకు
ఉచిత విద్యుత్
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నేటి నుంచి ప్రారంభమయ్యే మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరాను అందించేందుకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ మంగళవారం ప్రకటన వెలువరించారు. గత సంవత్సరం యాప్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా మండపాలకు ఇచ్చే స్లాబ్‌లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి గణేష్ మండపాల వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు.
జనగామ: జిల్లాలో నేటి (బుధవారం) నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా సర్కిల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి డీఈ, ఏడీఈ, ఏఈలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు, ఎలక్ట్రీషియన్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
మండప నిర్వాహకులకు సూచనలు
గణేష్ మండపాలను విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఏర్పాటు చేయరాదు. నాణ్యతతో కూడిన ఈఎల్‌సీబీ, ఎంసీబీలను మాత్రమే అమర్చుకోవాలి. లైసెన్స్ కలిగిన ఎలక్ట్రీషియన్‌తోనే వైరింగ్ చేయించుకోవాలి.
తీగలకు హుక్కింగ్ అస్సలు వేయరాదు. వైరింగ్‌లో జాయింట్లు లేకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులతో పాటు ఎలక్రిషన్లపై ఉంటుంది. మండపాలకు ఇనుప పైపులు ఉపయోగించినట్లయితే, వాటిని ఇన్సులేషన్‌తో కవర్ చేయాలి. నిర్వాహకులు, పూజలు చేసే సమయంలో భక్తులు తడి చేతులతో స్విచ్ బోర్డులు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మండపాలకు వచ్చే పిల్లల భద్రతకు స్విచ్ బోర్డులను ఎత్తైన ప్రదేశంలో బిగించాలి. అత్యవసర సమయాల్లో సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1912, ఏఈ, జేఎల్‌ఎం నంబర్లను అందులో కనిపించే విధంగా ముద్రించాలి.
విద్యుత్ శాఖ సిబ్బందికి..
విద్యుత్ తీగలు, ట్రాన్స్ ఫార్మర్ల సమీపంలో మండపాలు ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. గణేష్ విగ్రహాల ఎత్తులను రికార్డు చేసి, ఊరేగింపు మార్గాల్లో సరైన లైన్ క్లియరెన్స్ ఉందో లేదో ముందుగానే నిర్ధారించుకోవాలి. అన్ని ఎల్‌టీ, 11కేవీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తనిఖీ చేసి లోపాలను సరిచేయాలి. రద్దీ ప్రాంతాల్లో ఎల్‌టీ లైన్లకు స్పేసర్‌లను అమర్చాలి. నిమజ్జన ఊరేగింపు మార్గంలో విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది నిఘా ఉంచాలి. నిర్వాహకులతో భద్రతా సమావేశాలు నిర్వహించాలి.
అప్రమత్తంగా ఉండాలి
గణేష్ మండపాలతో పాటు నిమజ్జన ఊరేగింపుల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. నిర్వాహకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవచ్చు. గైడ్‌లైన్స్‌ను అనుసరించి డీఈ, ఏడీఈ, ఏఈల ఆధ్వర్యంలో సిబ్బంది మండపాల తనిఖీలు, ఫ్లెక్సీల ఏర్పాటు, అవగాహన తదితర వాటిపై దృష్టి సారించాలి. – టి.వేణుమాధవ్, ఎస్‌ఈ
భక్తితో పూజిద్దాం.. భద్రతతో నిఘా ఉంచుదాం..
మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలకు చెక్
నిర్వాహకులు, ఎలక్ట్రీషియన్లకు విద్యుత్ శాఖ సూచనలు

అప్రమత్తతే రక్ష..

అప్రమత్తతే రక్ష..