
సమస్యలు పరిష్కరించండి మహాప్రభో!
చెప్పులరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం..
ఈ ఫొటోని మహిళ యశ్వంతాపూర్ గ్రామానికి చెందిన మారబోయిన చంద్రకళ. తన భర్త మల్ల య్య అనారోగ్యంతో మరణించాడని, తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, ఇద్దరు ఆడపిల్లలను కూలీ పనులు చేసి పోషిస్తున్నానని, అంత్యోదయ కార్డు ఇప్పించి ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకుంది.
● గ్రీవెన్స్‌లో బాధితుల గోడు
● సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం..
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
● ప్రజావాణిలో 74 అర్జీలు
జనగామ రూరల్: పట్టా పాస్ బుక్ కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని, అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, వేతనాలు రాక కుటుంబం గడవటం లేదని.. ఇలా పలు సమస్యలతో ప్రజలు సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌లోని ప్రజావాణికి వచ్చారు. సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..అంటూ కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, పింకేష్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల నుంచి 74 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ కొమరయ్య, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించండి మహాప్రభో!