
పాఠశాల ఆవరణలోనే ఎఫ్‌ఆర్‌ఎస్
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకత, క్రమశిక్షణను పెంపొందించేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా హాజరు నమోదు విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకునేందుకు గత 24 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఈ సమయంలో టీచర్లు పాఠశాల ప్రాంగణానికి దూరంగా ఉన్నా.. ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ వేశారు. ఈ విధానం అమలు చేసే సమయంలో అన్ని పాఠశాల ఆవరణ (ప్రి మిసెస్)లో జీపీఎస్ సిస్టం ద్వారా అనుసంధానం చేశారు. ఈ నేపధ్యంలో సోమవారం నుంచి స్కూల్ ఆవరణలో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ వేయాలనే నిబంధనలు అమలు చేశారు. దీంతో టీచర్లు ఉరుకులు, పరుగులతో సమయంలోపు పాఠశాలకు చేరుకుని ఎఫ్‌ఆర్‌ఎస్ వేశారు.
పాఠశాల ప్రాంగణంలోనే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై స్కూల్ ప్రాంగణంలోనే ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఎక్కడైనా హాజరు నమోదు చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు మాత్రం పాఠశాల పరిధిలో ఉన్నప్పుడే హాజరు నమోదవుతుంది. చిన్న చిన్న సాంకేతిక ఆటంకాలు తొలి రోజుల్లో సహజమే కానీ త్వరలోనే వాటిని అధిగమిస్తామని అధికారులు వెల్లడించారు.
పలువురి ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్లు పెండింగ్
జిల్లాలో యూఆర్‌ఎస్ (గురుకులం), కేజీబీవీ, మో డల్, ప్రభుత్వ పాఠశాలలు 508 వరకు ఉన్నాయి. ఇందులో సుమారు 2,860 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటి వ రకు 2,848 మంది టీచర్లు, సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా 12 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఉదయం 9 గంటలు, సాయంత్రం ఉన్నత, ప్రాథమికోన్నత 4.15, ప్రాథమిక 4 గంటల వరకు రోజుకు రెండు సార్లు యాప్‌లో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో పలు చోట్ల సెల్‌ఫోన్ సిగ్నల్ మొరాయించడంతో అటెండెన్స్ పూర్తి చేసుకునేసరికే మొదటి పీరియడ్ పూర్తవుతుంది. సాయంత్రం కూడా అరగంట వరకు పాఠశాల ఆవరణలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వర్ సామర్థ్యాన్ని పెంచి సిగ్నల్ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు
జిల్లాలో 12 మంది
టీచర్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్