
యూరియా కోసం తిప్పలు
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాలకు చెందిన రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, రెండు బస్తాల కోసం స్థానిక పీఏసీఎస్‌ల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్ పీఏసీఎస్ కార్యాలయానికి శనివారం 555 బస్తాలు యూరియా రాగా ఆదివారం 293 బస్తాలను పంపిణీ చేశారు. మిగిలిన 262 బస్తాలను సోమవారం పంపిణీ చేస్తారని తెలుసుకున్న రైతులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. దీంతో రైతుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై వినయ్‌కుమార్, ఏఓ చంద్రన్‌కుమార్ పీఏసీఎస్ వద్దకు చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.