కాజీపేట రైల్వేడిపోకు పూర్వ వైభవం | - | Sakshi
Sakshi News home page

కాజీపేట రైల్వేడిపోకు పూర్వ వైభవం

Aug 25 2025 8:01 AM | Updated on Aug 25 2025 8:01 AM

కాజీపేట రైల్వేడిపోకు పూర్వ వైభవం

కాజీపేట రైల్వేడిపోకు పూర్వ వైభవం

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌లోని రన్నింగ్‌ డిపోకు త్వరలో పూర్వ వైభవం రానుంది. ఐదేళ్ల క్రితం వెలవెలబోయిన కాజీపేట జంక్షన్‌కు మహర్దశ పట్టనుంది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన రన్నింగ్‌స్టాఫ్‌ రివ్యూలో రైల్వే అధికారులు కాజీపేట రన్నింగ్‌ డిపోను దృష్టిలో పెట్టుకొని దసరా కానుకగా కొత్తగా పోస్టులు ప్రకటించారు. 90 గూడ్స్‌ అసిస్టెంట్‌ లోకో పైలెట్లు, 90 అసిస్టెంట్‌ లోకో పైలెట్లు, 10 ప్యాసింజర్‌ అసిస్టెంట్‌ లోకో పైలెట్లను కలుపుకొని కొత్తగా 190 పోస్టులను అధికారులు అలాట్‌మెంట్‌ చేసినట్లు రైల్వే ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఆదివారం తెలిపారు. గతంలో కాజీపేట జంక్షన్‌ నుంచి డోర్నకల్‌, విజయవాడ రైల్వే డిపోలకు రైల్వే క్రూ లింక్‌లు, లోకోపైలెట్లను తరలించి ప్రాధాన్యతను తగ్గించారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త పోస్టులతో ఆ సమస్య లేకుండా పోయిందని వివరించారు. కాజీపేట నుంచి క్రూ లింక్‌లను తరలించి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయవద్దని గతంలో ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, రైల్వే నాయకులు రైల్వే జీఎం, డీఆర్‌ఎంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నాటి రైల్వే జీఎం కాజీపేటకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాజీపేటకు అలాట్‌ చేసిన కొత్త పోస్టులతో మొత్తం కాజీపేట రైల్వే రన్నింగ్‌ డిపో 720 మంది స్టాఫ్‌తో సికింద్రాబాద్‌ డివిజన్‌లో పెద్ద డిపోగా మారనుంది. బెల్లంపల్లి, డోర్నకల్‌తోపాటు ఇతర రైల్వే డిపోల్లో పనిచేస్తూ కాజీపేటకు రెక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకున్న వారు ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కాజీపేట రైల్వే డిపోపై ప్రత్యేక శ్రద్ధ..

వయా కరీంనగర్‌ మీదుగా భీమవరం–నాందేడ్‌కు సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కాజీపేట రైల్వే డిపోకు చెందిన క్రూ వారే (లోకోపైలెట్‌, అసిస్టెంట్‌ లోకోపైలెట్‌, ట్రైయిన్‌మేనేజర్‌–గార్డు) పనిచేసే అవకాశం ఉందని, అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో ఈ రైలుకు ఆరుగురు రన్నింగ్‌ స్టాఫ్‌ పనిచేస్తారని రైల్వే నాయకులు తెలిపారు. భవిష్యత్‌లో కరీంనగర్‌ మీదుగా నిజమాబాద్‌, నాందేడ్‌ వరకు ఎక్కువ రైళ్లను ప్రవేశపెట్టి నడిపించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట రైల్వే డిపోపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని పేర్కొన్నారు.

రైల్వే నాయకుల హర్షం..

కాజీపేట రైల్వే డిపోకు కొత్తగా సికింద్రాబాద్‌ రైల్వే అధికారులు 190 ఎల్‌పీ, ఏఎల్‌పీల పోస్టులను మంజూరు చేసినందుకు కాజీపేట రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ లోకో రన్నింగ్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ పాక రాజ్‌కుమార్‌, కాజీపేట రైల్వే మజ్దూర్‌ యనియన్‌ లోకోరన్నింగ్‌ బ్రాంచ్‌ సెక్రటరీ పి.సాయికుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

దసరా కానుకగా కొత్త పోస్టులు ఇండెంట్‌

190 ఎల్‌పీ, ఏఎల్‌పీ పోస్టులకు

గ్రీన్‌సిగ్నల్‌

రన్నింగ్‌ స్టాఫ్‌ క్రూ రివ్యూలో నిర్ణయం

ఫలించిన ఎంపీ, ఎమ్మెల్యే,

రైల్వే నాయకుల కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement