
భక్తిశ్రద్ధలతో తీజ్ ఉత్సవాలు
జనగామ : జనగామ జిల్లాలో తీజ్ ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సేవాలాల్ మహరాజ్‌కు గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు. తండాలతో పాటు జనగామ పట్టణంలో తీజ్ వేడుకలు అంబరాన్నంటాయి. సంప్రదాయ నృత్యాలతో బంజారా మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలు, యువకులు, చిన్నారులంతా పాల్గొని తీజ్ పండుగను వైభవంగా నిర్వహించారు.
పట్టణంలో శోభాయాత్ర
జనగామ పట్టణంలో స్థానిక బంజారాలు తీజ్ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్, మేరమా యాడి, జగదాంబ మాత ఆశీస్సులతో మొదలైన ఉత్సవాల్లో బంజారా పెద్దలు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తరతరాలుగా బంజారాలు అడవి జీవన విధానంలో అలవాటు పడి, ప్రకృతినే ఆరాధిస్తూ జీవనం సాగిస్తున్నారని పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సకల సంపదల మూలమే ప్రకృతి అని చాటి చెప్పే ఈ తీజ్ పండుగ బంజారాల ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో తీజ్ వేడుకలను ఆచరిస్తూ, తండావాసుల సంక్షేమం కోసం, చక్కటి వరుడు దొరకాలని దేవుడిని కోరుకనే పండుగ తీజ్ అని పేర్కొన్నారు. వేడుకలో చివరి రోజు సుమారు ఐదు వందల మంది బంజారాలు పాల్గొని పట్టణంలో భారీ శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం తీజ్ బుట్టలను భక్తిశ్రద్ధలతో చెరువులో నిమజ్జనం చేశారు. మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, వంశీ, లాలమ్మ, రవి, కిషన్‌న్, డాక్టర్ బాలాజీ స్వప్నరాథోడ్, ప్రదీప్, శంకర్, డాక్టర్ రఘు, దేవి, మంజుల, పద్మ, విజయ, లలిత పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున శోభాయాత్ర
ఆధ్యాత్మిక వాతావరణంలో తీజ్ బుట్టల నిమజ్జనం

భక్తిశ్రద్ధలతో తీజ్ ఉత్సవాలు