
గోదావరి జలాలు తీసుకొస్తా
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వేలేరు: వచ్చే యాసంగి నాటికి పైప్‌లైన్ పనులు పూర్తి చేసి గండిరామారం రిజర్వాయర్ నుంచి వేలేరు మండలానికి గోదావరి జలాలు తీసుకొచ్చి మండలంలోని రైతులకు సాగునీరందిస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని మల్లికుదుర్ల, సోడాషపల్లి, పీచర, శాలపల్లి, లోక్యాతండా, వేలేరు గ్రామాల్లో పనుల జాతర–25 కార్యక్రమంలో భాగంగా రూ.3 కోట్ల 69 లక్షల 35 వేల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా వేలేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలానికి సంబంధించిన ఎంపీడీఓ కార్యాలయ నిర్మాణానికి మరో రూ.2.50 కోట్లు నిధులు పెంచి ఇవ్వాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఓ వ్యక్తి పాలనను గాలికి వదిలి పదవిని అడ్డం పెట్టుకుని పదవులు, పనులు, పథకాలు అమ్ముకుని అక్రమంగా సంపాదించాడని విమర్శించారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
వేలేరు మండలం మల్లికుదుర్లలోని ఎస్సీ కాలనీలో రూ.25 లక్షలు, సోడాషపల్లిలో రూ.25 లక్షలు, పీచరలో రూ.33.20 లక్షలు, శాలపల్లిలో రూ.16.60 లక్షలు, వేలేరులో రూ.45.55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాలపల్లిలో రూ.12 లక్షలు, లోక్యాతండాలో రూ.12 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లోక్యాతండా నుంచి పీచర వరకు రూ.2 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, పీఆర్ ఈఈ ఆత్మరామ్, అగ్రికల్చర్ ఏడీ ఆదిరెడ్డి, డీడబ్యూఓ జయంతి, తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, పీఆర్ డీఈ శిరీష, పీఆర్‌ఏఈ రూపావతి, ఏఓ కవిత, ఎంపీఓ భాస్కర్, మాజీ ఎంపీపీ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, నాయకులు మల్లికార్జున్, బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, సమ్మయ్య, రాజిరెడ్డి, ప్రమోద్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.