
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
విధుల్లో నిర్లక్ష్యం, ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ అధికారి తన పనిని అంకితభావంతో చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన... పట్టణంలోని 30 వార్డుల్లో పర్యటిస్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అక్ర మ నిర్మాణాలు, సెల్లార్ల భాగోతం, ఎంక్రోచ్‌మెంట్లు, నిర్మాణాలు చేసుకుని నెలలు గడిచి పోతున్నా.. ఇంటినంబర్లకు నోచుకోని ఇళ్లు తదితర సమస్యలు నేరుగా గుర్తించేందుకు దోహదపడుతుంది. రిజిస్ట్రేషన్లు, బీమా లేకుండా నడిపిస్తున్న శానిటేషన్, ఇతర వాహనాల పరిస్థితిపై దృష్టి సారిస్తే.. జరిమానాల రూపంలో పురపాలికపై కొంత భారం తగ్గించి, ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బులతో మరింత అభివృద్ధి చేయవచ్చు.
జనగామ: గాడితప్పిన జనగామ పురపాలికను పట్టాలెక్కించేందుకు బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి రంగంలోకి దిగారు. ‘గాడిన పడేనా?’ కొత్త మున్సిపల్ కమిషనర్‌కు ఎన్నో సవాళ్లు.. శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్‌లో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ తదితర సెక్షన్ ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లతో మహేశ్వర్‌రెడ్డి సమావేశమయ్యారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, మున్సిపల్ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాల కట్టడికి..
పట్టణంలో అక్రమ నిర్మాణాల కట్టడికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రణాళిక శాఖ ఇంటి అనుమతులతో పాటు నిర్మాణ సమయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలంటూ హుకుం జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, దానికి ఖచ్చితమైన సమాధానం చెప్పేలా బాధ్యత కలిగి పనిచేయాలని చెప్పారు. జనగామలో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు, ఎంక్రోచ్‌మెంట్లు, నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల నిర్వహణపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని ప్ర జలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇంటి నిర్మాణ అనుమతుల్లో జాప్యం ఉండకుండా చూసుకుని, రెవెన్యూ వసూళ్లలో పురోగతి సాధించాలని ఆదేశించారు. అస్తవ్యస్తంగా మారిన టౌన్ ప్లానింగ్ శాఖను మేలు కొలిపే విధంగా కమిషనర్ పనితీరు ప్రజల్లో కొంతమేర విశ్వాసాన్ని పెంచుతోంది. అధి కారం చేపట్టిన రెండవ రోజే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్‌లో పట్టణ పాలనలో క్రమశి క్షణ, పారదర్శకత పెరగనుందనే సంకేతాలు ఇస్తోంది. అధికారులు తమ విధుల్లో సమయపాలన పా టించాలని తెలిపారు. ఇంటి అసెస్‌స్మెంట్లలో వేగం పెంచి రెవెన్యూ వసూళ్లలో పారదర్శకత సాధించా లని సూచించారు. ప్రజలకు న్యాయం జరి గే విధంగా ప్రతి చర్యలో స్పష్టత ఉండాలన్నారు.
నిర్లక్ష్యానికి తావులేదు
ఇంటి అనుమతుల జాప్యంపై ఆరా
శానిటేషన్ నిర్వహణపై ఫోకస్
ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి
బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే మున్సిపల్ కమిషనర్ ఉద్యోగులతో సమీక్ష
శానిటేషన్‌పై దృష్టి
పట్టణంలో భ్రష్టుపట్టిన శానిటేషన్ నిర్వహణపై నూతన కమిషనర్ ఫోకస్ సారించారు. శానిటేషన్ నిర్వహణలో మార్పులు తీసుకురావాలని సంబంధిత శాఖకు సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యంగా పని చేయాలన్నారు.

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!