
గాడిన పడేనా?
జనగామ: గాడి తప్పిన జనగామ పురపాలిక పాలన కొత్త కమిషనర్‌కు ముళ్ల కిరీటం కానుంది. పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పగా, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వ్యవస్థ అదుపు తప్పి ప్రైవేటు వ్యక్తులు ఆజమాయిషీ చేసే స్థాయికి దిగజారింది. అడ్డగోలు నిర్మాణాలు, అనుమతుల్లో జాప్యం, అక్రమంగా సెల్లార్ల నిర్వహణ ఇలా చెప్పుకుంటే పోతే అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. గత కమిషనర్ వెంకటేశ్వర్లు రామగుండం కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లగా, వెయింటింగ్‌లో ఉన్న డి.మహేశ్వర్‌రెడ్డి గురువారం జనగామ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
ముందున్న సవాళ్లు..
పట్టణ పరిపాలనలో అనేక సవాళ్లు, సమస్యలు జనగామ కొత్త కమిషనర్‌కు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణం వేగంగా విస్తరిస్తున్నా దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పన్ను వసూళ్లలో పారదర్శకత, నిర్మాణ అనుమతుల్లో నిబంధనలు, మౌలిక సదుపాయాల మెరుగుదల ఇవన్నీ కొత్త కమిషనర్ ముందున్న కీలక అంశాలు. పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలు కొంతకాలంగా సరిగా సాగడం లేదు. వీటిని సమర్థవంతంగా సరిదిద్దడం, గాడితప్పిన పాలనను మళ్లీ సరైన దారిలో నడిపించడం కొత్త కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ముందు పరీక్షగా మారింది.
పారిశుద్ధ్యం..అస్తవ్యస్తం..
జనగామలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారిపోయింది. డ్రైనేజీలను గాలికి వదిలేయగా, రోడ్లపై చెత్తడంపులు దుర్వాసన వెదజల్లుతున్నాయి. జీఎంఆర్ కాలనీ, బాలాజీనగర్, కుర్మవాడ, శ్రీ సాయి రెసిడెన్సీ, హౌజింగ్ బోర్డు, ఇందిరమ్మ కాలనీ, గిర్నిగడ్డ, సూర్యాపేట రోడ్డులోని పలు కాలనీలు, గీతానగర్, ఇండస్ట్రియల్ ఏరియా, ధర్మకంచ, తదితర వార్డుల్లో డ్రైనేజీలు అధ్వానంగా మారగా..దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
కొత్త మున్సిపల్ కమిషనర్‌కు
ఎన్నో సవాళ్లు
పట్టుతప్పిన పట్టణపాలన
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ
అనుమతుల్లేని నిర్మాణాలు..
జనగామ కమిషనర్‌గా మహేశ్వర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
అడ్డగోలు నిర్మాణాలు..
పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు, ఫైర్ సేఫ్టీ లేకుండా కట్టడాలు, అనుమతులకు మించి ఫ్లోర్స్ తదితర నిర్మాణాల సమయంలో చర్యలు శూన్యం. ఇటీవల శ్రీలక్ష్మి, విజయ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగి కోట్ల ఆస్తినష్టం వాటిల్లినా, తిరిగి నిర్మాణ సమయంలో ఎలాంటి నిబంధనలు తీసుకుంటున్నారనే పర్యవేక్షణ లేకుండా పోయిందని ప్రజలు మండిపడుతున్నారు. కృష్ణాకళామందిర్ రూట్‌తో పాటు బాలాజీనగర్, సిద్దిపేట రోడ్డు, జ్యోతినగర్ ఏరియా, తదితర ప్రాంతాల్లో భారీ భవంతుల నిర్మాణం జరుగుతోంది. వీటికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అని పర్యవేక్షించేవారు లేకపోయారు. పురపాలికలోని అన్ని విభాగాలపై నిఘా ఉంచి గాడితప్పిన పురపాలికను పట్టాలెక్కించే బాధ్యత కొత్త కమిషనర్‌పై ఉంది. ఇదిలా ఉండగా కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించగా, తర్వాత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పురపాలిక స్పెషల్ ఆఫీసర్ పింకేశ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

గాడిన పడేనా?