
సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా!
జనగామ: డీఎస్సీ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయ్యేనా!.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతీ డీఎస్సీకి ముందు 3 సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెట్ ఆవిర్భావం తర్వాత 2012 డీఎస్సీకి ముందు 3 సార్లు టెట్ నిర్వహించగా, జూలై 2011, 2012 జనవరి, జూన్, ఆగస్టు మాసాల్లో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత మార్చి 2014, మే 2016, జూలై 2017లో టెట్ అర్హత పరీక్ష నిర్వహించారు. అనంతరం 2017 అక్టోబర్‌లో డీఎస్సీ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ జారీ చేసి 2018 ఫిబ్రవరిలో 8,792 పోస్టులకు గాను డీఎస్సీ పరీక్షలు జరిపారు. అప్పటి నుంచి 4 సంవత్సరాల వరకు టెట్ నిర్వహించలేదు. తిరిగి జూన్ 2022, సెప్టెంబర్ 2023, మే–జూన్ మాసం 2024లో టెట్ నిర్వహించి, 2024 జూలైలో డీఎస్సీ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. గత డీఎస్సీ తర్వాత 2025 జనవరి, 2025 జూన్‌లో టెట్ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం టీచర్ల పదోన్నతి, పదవీవిరమణతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు మరో డీఎస్సీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది చివర లేదా వచ్చే సంవత్సరం జనవరిలో మరో టెట్ నిర్వహించే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు. దీంతో మరో టెట్ తర్వాతనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో 6వేల మంది పోటీ
జిల్లాలో 250 టీచర్ పోస్టులు ఉండే అవకాశం ఉంది. గత 2024 డీఎస్సీ ద్వారా దాదాపు 221 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాగా, ఎస్జీటీలో 117, స్కూల్ అసిస్టెంట్, ఇతర విభాగాలు కలుపుకుని 100 పోస్టులను భర్తీ చేశారు. దీని కోసం 5 వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇప్పుడు మరో డీఎస్సీ కోసం దాదాపు 6 వేల మంది పోటీ పడే అవకాశం ఉండగా, రాత్రింబవళ్లు ప్రిపరేషన్ అవుతున్నారు. ఆర్థికశాఖ అనుమతి బట్టి ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరో టెట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్!
ప్రస్తుత పదోన్నతులతో 200 ఉపాధ్యాయ ఖాళీలు