జనగామ రూరల్: పట్టణంలోని బతుకమ్మకుంట అభివృద్ధి, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. గురువారం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ ఉద్యాన శాఖ అధికారులతో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలిస్తూ మొరం నింపి అందంగా తీర్చిదిద్దాలన్నారు. పార్క్ ఆవరణలో చెత్త చెదారం ఉండరాదన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి శ్రీధర్‌రావు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు హనుమకొండ కలెక్టరేట్‌లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈనెల 22న (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ : మెరుగైన సేవల కోసం ప్రయాణికులనుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న (శుక్రవారం) ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తరిగొప్పుల, పాలకుర్తి రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్
జనగామ రూరల్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ సూచించారు. గురువారం పట్టణంలోని సబ్‌జైలును ఆయన సందర్శించి మాట్లాడారు..జైల్లో ఉన్న నేరం మోపబడిన ఖైదీల భోజన వసతి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులు లేని ఖైదీలు ఎవరైనా ఉంటే జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ దృష్టికి లిఖితపూర్వకంగా తెలియజేస్తే ఉచిత న్యాయవాదిని నియమిస్తామన్నారు. జైల్లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. జైలులో ఖైదీలకు ఏవైనా సమస్యలు ఉంటే పేపర్‌పై రాసి కంప్లైంట్ బాక్స్‌లో వేయాలని చెప్పారు.
జాతీయస్థాయి పారా అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని నమిలిగొండ శివారులోని ప్రభుత్వ మాడల్ స్కూల్‌కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సిద్దార్థనాయక్ జాతీయస్థాయి పారాఅథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సి పాల్ వేణుగోపాల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 6 నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరుగనున్న పారాఅథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జావెలిన్ త్రో పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి సిద్దార్థనాయక్ ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థి సిద్దార్థనాయక్‌ను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు. పీఈటీ అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బతుకమ్మకుంట పనుల పరిశీలన