
ఆహ్లాదకరంగా స్మృతివనం
పాలకుర్తి టౌన్: బసవ పురాణం గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడి స్మృతివనంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ‘అధ్వానంగా సోమనాథుడి స్మృతివనం’ శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం కదిలివచ్చింది. గురువారం మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న స్మృతివనాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మృతి వనం పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, ఆలయానికి వచ్చే భక్తులు సందర్శించి కాసేపు గడిపే విధంగా తీర్చిదిద్దాలన్నారు. స్మృతివనం పరిసర ప్రాంతాల్లోకి అపరిచిత వ్యక్తులు రాకుండా పోలీసులు నిరంతరం నిఘా పెంచాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యను కలెక్టర్ ఫోన్‌లో ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో పీడీ వసంత, జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూప, అడిషనల్ ఏపీడీ నూరోద్ధిన్, పీఆర్ డీఈ రామలింగాచారి, ఎంపీడీవో రవీందర్, ఇన్‌చార్జి ఎంపీవో నీరటి మాధవ్, పంచాయతీ కార్యదర్శి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
యూరియా కొరత లేదు..
పీఏసీఎస్, ఫర్టిలైజర్ల దుకాణాల్లో రైతులకు సరిపడా యూరియా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలు, మన గ్రోమోర్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి యూరియా గోదాంలను తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని కళ్యాణమండపాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కళ్యాణమండపంలో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ వసంతను ఆదేశించారు.
చిన్నారుల ఆరోగ్యరక్షణకు స్వర్ణప్రాశన
జనగామ: చిన్నారుల ఆరోగ్య రక్షణకు పూర్వకాలంలో స్వర్ణ ప్రాశన వేసేవారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్‌నెస్ హాస్పిటల్‌లో పుష్యమి నక్షత్రం పురస్కరించుకుని 6 నెలల నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత స్వర్ణప్రాశన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. స్వర్ణప్రాశనతో పిల్లలో మేథోశక్తి పెరగడంతో పాటు జీర్ణ శక్తిని మెరుగుపడుతుందన్నారు.
బాలల రక్షణ సామాజిక బాధ్యత..
జనగామ రూరల్: బాలల రక్షణ ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. బాలబాలికల రక్షణ, మానవ అక్రమ రవాణా అనే అంశాలపై ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో ఏకశిల బీఈడీ కళాశాలలో జిల్లా రిసోర్స్ పర్సన్‌లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు..పాఠశాలల యాజమాన్యాలు,, పిల్లల తల్లిదండ్రులు వారి సంరక్షణ కోసం ప్రధాన భూమిక నిర్వహించాలన్నారు. అన్ని రకాల నిర్లక్ష్యం, దోపిడీల నుంచి బాలలకు రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, గౌసియా బేగం, సెంటర్ ఇన్‌చార్జ్ మల్లికార్జున్, ప్రజ్వల ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
తీసుకోవాలి
సోమనాథుడి స్మృతివనాన్ని సందర్శించిన కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
‘సాక్షి’ కథనానికి కదిలిన
జిల్లా యంత్రాంగం