
టీచర్ల పోరుబాట
● రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎదుట మహాధర్నా
● ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారమే ప్రధాన డిమాండ్
జనగామ: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి యునైటెడ్ స్కూల్ టీచర్స్ యూనియన్(యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా భారీ ధర్నాకు ఐక్య ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యారంగంలో కొనసాగుతున్న బోధనా సిబ్బంది లోపాలు, వేతన బకాయిలు, పదో న్నతులు, పెన్షన్ సమస్యలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లడం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల హక్కులు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ప్రతిపాదనలు, విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో చివరి అస్త్రంగా రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ 3 దశల పోరాటంలో భాగంగా చివరి అంకంలో 23న ఇం దిరా పార్క్ ఎదుట తలపెట్టిన రాష్ట్రస్థాయి ధర్నాకు పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టు హామీలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. పీఆర్సీని ప్రకటించి అమలుచేయాలని, పెండింగ్ డీఏలను చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆరోపించారు. ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్ప రాంరెడ్డి కోరారు.
ప్రధాన డిమాండ్లు ఇవి..
● అన్ని క్యాడర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలి. జీహెచ్‌ఎం, ఎస్‌ఏ, పీఎస్‌హెచ్‌ఎం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి.
● జీవో నెంబర్ 25ను సవరించాలి. ప్రతీ పాఠశాలలో కనీసం ఇద్దరు, 40 మంది విద్యార్థులకు తరగతికి ఒక్కరు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ వర్క్‌లోడ్‌కు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలి.
● పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలి.
● 2003 డీఎస్సీ టీచర్లకు పాతపెన్షన్‌కు ఆప్షన్ ఇవ్వాలి
● ీఓపీఎస్‌ను పునరుద్ధరించాలి.
● 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలి.
● పైరవీ డిప్యూటేషన్లను రద్దు చేయాలి.